ఏపీలో కులాలపై విష ప్రచారం జరుగుతోంది : పవన్ కళ్యాణ్

-

ఏపీలో కులాలపై విష ప్రచారం జరుగుతోందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సమాజంలో కులాలను విడదీసే మనుషులు ఎక్కువ ఉన్నారని మండిపడ్డారు. కాపుల దగ్గర అంత ఆర్థిక బలం లేదని పవన్ కల్యాణ్ తెలిపారు. సంఖ్యా బలం ఉన్నా ఐక్యత లేదన్నారు. కానీ ఐక్యత ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమని పవన్ పేర్కొన్నారు. సంఖ్యాబలం ఉంటే అధికారం పంచుకోక తప్పదని అర్థం కావాలన్నారు. గతంలో 93 ఉన్న బీసీ కులాలు ఇప్పుడు 140కి ఎందుకు పెరిగాయని పవన్ కళ్యాణ్ అడిగారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆంధ్రప్రదేశ్‌కి వస్తే జనసేన పార్టీ ఆహ్వానించిందని గుర్తుచేశారు. మరి, తెలంగాణలో 26 కులాలను బీసీల జాబితా నుంచి తొలగించడంపై బీఆర్ఎస్ స్పందించాలని డిమాండ్ చేశారు.

అన్యాయంపై బీఆర్ఎస్ వివరణ ఇవ్వాలన్నారు. అలాగే, బీసీ కులాల తొలగింపుపై ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, విపక్ష తెలుగు దేశం పార్టీలు స్పందించాలని డిమాండ్ చేశారు.బీసీలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు. చట్టసభల్లో సంఖ్యా బలం లేని బీసీలకు ఏం చేయగలం అనే దానిపై ఆలోచిస్తానని వెల్లడించారు. మీ ఓట్లే మీకు పడవని బీసీలను హేళన చేస్తున్నారని తెలిపారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టినప్పుడు అందరూ ఏకతాటిపైకి రావాలన్నారు. తనను ఒక కులానికి పరిమితం చేసి బీసీ నాయకులతో తిట్టిస్తున్నారని చెప్పారు. తనను బీసీలతో తిట్టిస్తే రెండు వర్గాల వారు గ్రామస్థాయిలో ఘర్షణకు దిగుతారని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఒక కులానికి మాత్రమే నాయకుడిని కాదని.. ప్రజలందరికీ నాయకుడిగా ఉండాలని అనుకుంటున్నానని పవన్‌ కళ్యాణ్‌ వెల్లడించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version