ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని విషయంలో రాజకీయ పార్టీలు అన్నీ కలిసి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు, బిజెపి ఇలా దాదాపు అన్ని పార్టీలు కూడా పోరాటాన్ని ముమ్మరం చేస్తున్నాయి. రైతులకు అన్యాయం జరుగుతుందని, రాజధాని అంటేనే వారు భూములు ఇచ్చారు గాని తిరిగి ఇస్తామంటే కాదని రాజకీయ పార్టీలు వారికి అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో అమరావతి కోసం పోరాటం చేయడానికి సిద్దమయ్యారు. విశాఖలో ఇసుక సమస్య మీద లాంగ్ మార్చ్ చేసినట్టు అదే విధంగా అమరావతి కోసం కూడా లాంగ్ మార్చ్ చెయ్యాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. విజయవాడ లేదా గుంటూరు నుంచి అమరావతికి భారీగా ర్యాలీగా వెళ్లాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
గతంలో అమరావతి మీద కేబినెట్ నిర్ణయం తర్వాత స్పందిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కానీ, కేబినెట్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. హైపవర్ కమిటి నిర్ణయం తర్వాత పవన్ కళ్యాణ్ దీనిపై తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశ౦ ఉందని అంటున్నారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు. తెలుగుదేశం సహా వామపక్షాల మద్దతు తీసుకోవాలని చూస్తున్నారు పవన్.