పల్లీలు అనగానే చాలా మంది వాటిని చట్నీకి, స్వీట్లకు ఉపయోగించే పదార్థం అని అనుకుంటారు. కానీ అవి నిజానికి మనకు పోషకాలనిచ్చే భాండాగారం అని చెప్పవచ్చు. మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు పల్లీల్లో ఉంటాయి. వీటిని కొన్ని ప్రాంతాల్లో వేరుశెనగలు అని కూడా పిలుస్తారు. సరే.. పేరేదైనా పల్లీలను రోజూ తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పల్లీల్లో ఉండే మాంగనీస్ ఫ్యాట్, కార్బొహైడ్రేట్లను త్వరగా కరిగిస్తుంది. శరీర కణాల్లోకి ఆ పదార్థాలు త్వరగా చేరేలా చేస్తుంది. అందువల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో షుగర్ త్వరగా అదుపులోకి వస్తుంది. పల్లీలను రోజూ తినడం వల్ల డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
2. మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే గాల్ స్టోన్స్ వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమస్య ఉన్నవారు పల్లీలను తినాలి. దీంతో శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ కరుగుతుంది. గాల్ స్టోన్స్ రాకుండా ఉంటాయి.
3. పల్లీలను రోజూ తినడం వల్ల మెదడు బాగా పనిచేస్తుందట. జ్ఞాపకశక్తి రెట్టింపవుతుందట. అందుకనే చిన్నారులకు రోజూ పల్లీలను తినిపించాలని వైద్యులు చెబుతున్నారు.
4. పల్లీలను తినడం వల్ల డిప్రెషన్ తగ్గుతుంది. మానసిక సమస్యలైన ఒత్తిడి, ఆందోళన, కంగారు తగ్గుతాయి. అలాగే అధిక బరువు కూడా తగ్గుతారు.
5. చర్మ సమస్యలు ఉన్నవారు పల్లీలను తినడం మంచిది. పల్లీలను రోజూ తినడం వల్ల గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం చాలా తక్కువగా ఉంటుందట.