సిద్దిపేట జిల్లా కొమువెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శివరాత్రి వేడుకల్లో భాగంగా ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమం నిర్వహించారు. ఒగ్గు కళాకారులు అత్యంత భక్తి ప్రపత్తులతో పెద్దపట్నాన్ని రూపొందించారు. పెద్దపట్నం పూర్తయిన తర్వాత మధ్యలో స్వామి వారిని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఒగ్గు కళాకారులు స్వామిని తీసుకుని ముందుగా పెద్దపట్నం దాటారు.
అనంతరం శివసత్తులు తాండవం చేస్తూ పెద్దపట్నం దాటారు. వారి తర్వాత పంచవర్ణాలతో వేసిన పెద్దపట్నాన్ని దాటేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈ క్రమంలో భారీ తేలు కనిపించడంతో పెద్దపట్నంవైపు భక్తులు దూసుకొచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు లాఠీలకు పని చెప్పారు. భక్తులను పట్నం నుంచి బయటకు పంపి పరిస్థితులను చక్కబరిచారు. మహాశివరాత్రి వేడుకల సందర్భంగా కొమురవెల్లిలో ఎలాంటి అవాంఛీనయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు.