చినిగిన చొక్కా అయిన తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో అని అంటారు.. పుస్తక ప్రేమికులు ఈ విషయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.. ఉన్నడబ్బులను రకరకాల పుస్తకాలు కొనడానికే ఎక్కువగా ఖర్చుపెడతారు. రత్నాలను రాశులుగా పోసీ అమ్మినచోటే..నేడు పుస్తకాలను అమ్ముతున్నారు. హైదరాబాద్ నగరంలో ఫుట్‌పాత్‌ల పక్కన సైన్సు, విజ్ఙానం, అంతరిక్ష శాస్త్రం, వాస్తు, జ్యోతిష్యం , పరిశోధకులకు అవసరమైన రిఫరెన్స్ బుక్స్ ఇలా ఒకటేమిటి కోఠి, అబిట్స్ సండే మార్కెట్లో దొరకని పుస్తకం ఉండదు. ఎన్నో దశాబ్దాలుగా దాదాపు 6 వేల మంది సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్ముతూనే జీవనం సాగిస్తున్నారు.
అధిక ధరలు పెట్టి కొత్త బుక్స్ కొనలేని వారికి తక్కువ ధరకే రూ.10 నుంచి రూ.100కే అందిస్తున్నారు. హైదరాబాద్‌లోని కోఠి, అబిట్స్ సండే మార్కెట్ ఈనాటిది కాదు. 8 దశాబ్దాలుగా ఈ మార్కెట్ వృద్ధి చెందుతూ వచ్చింది. కవులు, కళాకారులు, అకడమిక్ బుక్స్ కోసం వెతికే వారికి, ఇలా దాదాపు 12 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఒక్క ఆదివారం నాడే కోఠి మార్కెట్లో దాదాపు 50 వేల పుస్తకాల అమ్మకాలు జరుగుతాయని అంచనా.
చాలా తక్కువ ధరకే ఎంఆర్పీ రూ.800 ఉన్న పుస్తకాన్ని కేవలం రూ.150కే అందిస్తారు ఇక్కడి విక్రేతలు. కేవలం ఒక్కో పుస్తకంపై రూ.20 లాభం చూసుకుని పుస్తకాలు విక్రయాలు సాగిస్తున్నారు. సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనేవారు కూడా పెద్ద మొత్తం ఖర్చు చేయలేని వారితో పాటు, బుక్ షాపుల్లో కూడా లభించని వాటి కోసం చాలా మంది వస్తూ ఉంటారు. వారందరికీ కోఠి పుస్తకం ప్రపంచం ఒక వరమనే చెప్పాలి.
ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నారు కాళోజీ. తెలుగు వారు పుస్తక ప్రియులు. కొందరైతే ఏకంగా వందలాది పుస్తకాలు చదవి ఇంట్లోనే ఓ లైబ్రరీ తయారు చేసుకుంటూ ఉంటారు. ఇక రచయితలు, కవులు అయితే ఎన్ని పుస్తకాలు చదివితే వారు అంత ఆనందం పొంతుతారు. విద్యార్థులు, పోటీ పరీక్షలకు తయారవుతున్న నిరుద్యోగులు ఇలా ఒకరేంటి అన్ని రంగాల వారు బుక్స్ కావాలంటే మాత్రం ఆదివారం కోఠి మార్కెట్‌ను సందర్శిస్తారు.
కోఠి, అబిట్స్ ప్రాంతాలు చాలా రద్దీగా మారాయి. దీంతో పుస్తక విక్రేతలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వారిని ఉమెన్స్ కాలేజీ వద్ద నుంచి ఖాళీ చేయించారు. ఆ తరవాత వారు అనేక షాపుల ముందు పుట్ పాతులపై పుస్తకాల విక్రయిస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే.. చాలు ఆటోల్లో, రిక్షాల్లో బండిల్స్ కొద్దీ పుస్తకాలు వేసుకుని వచ్చి, వాటిని ఓ క్రమ పద్దతిలో సర్దుకుని పెట్టుకుంటారు. ఏ పుస్తకం కావాలన్నా క్షణాల్లో తీసి ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకుంటారు. ఒక వేళ వారి వద్ద ఆ పుస్తకం లేకుంటే, అది ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తారు. హైదరాబాద్ అంటే ఎప్పుడూ రద్దీగా ఉండే నగరమే కాదు.. ఒక ఎమోషన్.. మోనంగా మనతో మాట్లాడుతున్నట్లు ఉంటుంది.. అది ఆస్వాదించిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఇంతకీ మీరు కూడా కోఠిలో ఎప్పుడైనా పుస్తకాలు కొన్నారా..?