ఫిలిప్పీన్స్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నల్గే తుపాను పెను బీభత్సం సృష్టించింది. తుపాను కారణంగా ఎగసిపడ్డ రాకాసి అలలను చూసి సునామీ వస్తోందని భావించి ఎత్తైన ప్రాంతంలో ఉండే ఓ చర్చి వద్దకు పరుగెత్తిన గ్రామస్థులు బురదలో సజీవ సమాధి అయ్యారు. దక్షిణ మాగ్విండనావో ప్రావిన్స్‌లోని కుసియోంగ్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకు 18 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. ఇక్కడ మృతుల సంఖ్య 80 నుంచి వంద వరకు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
బాధితుల్లో కొన్ని కుటుంబాలకు చెందిన అందరు సభ్యులు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. సునామీ వచ్చిందని ప్రజలు పొరపాటు పడటం వల్లే పెద్ద ఎత్తున ప్రాణనష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 18 మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు. మృతుల్లో పిల్లలు సైతం ఉన్నట్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న రక్షణ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.