ఏసీబీ అధికారులూ.. దోపిడీ దొంగలా.. డిఫ్యూటీ సీఎం ఫైర్..

-

ఏసీబీ.. ఈ పేరు చెబితేనే అవినీతి అధికారులకు హడల్.. అవినీతిని రూపుమాపే ఈ ఏసీబీ అధికారులే లంచగొండలైతే.. ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోంది. విశాఖలో ఇలాంటి ఏసీబీ అధికారుల సంగతి బయటపడింది. దీనిపై ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొందరు ఏసీబీ అధికారులు దారి దోపిడీ దొంగల్లా తయారయ్యారని మండిపడ్డారు. అవినీతిని అరికట్టే వాళ్లే లంచాల కోసం అడ్డదారులు తొక్కడం దారుణమన్నారు. విశాఖలోని ఏసీబీ అధికారుల పని తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. ఏసీబీ డీజీతోనూ, హోం మంత్రితోనూ ఈ అంశంపై మాట్లాడినట్లు మంత్రి తెలిపారు.

ఈ కేసు విషయంలో విచారణే అవసరం లేదని, పూర్తి సాక్ష్యాధారాలున్నాయన్నారు.
తప్పు చేసిన వారిపై ఎలాంటి కేసులు పెడతారో.. తప్పు చేసిన ఏసీబీ అధికారుల మీదా అలాగే కేసులు పెట్టాలని సూచించారు. తప్పు చేసిన ఏసీబీ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి.. సస్పెండ్ చేయాలని కోరారు. లంచాలు ఇవ్వని అధికారులపై తప్పుడు కేసులు బనాయిస్తారా అని ప్రశ్నించారు.

ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైన యువ అధికారులు పారదర్శకంగా వ్యవహరిస్తుంటే.. తన శాఖకే చెందిన కొందరు కుమ్మక్కై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ రేంజ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల డీఐజీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version