కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం చాలా మంది ఇండ్లలోనే ఉంటూ.. స్మార్ట్‌ఫోన్లలో గేమ్స్‌ను ఎక్కువగా ఆడుతున్నారు. ఆ గేమ్స్‌లో లూడో కూడా ఒకటి. అయితే మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో లూడో ఆడితే ఓకే.. కానీ తెలియని వ్యక్తులతో.. ఆన్‌లైన్‌లో ఈ గేమ్ ఆడితే.. మీరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అవును.. ఇది నిజమే.. ఎందుకంటే.. ఈ గేమ్‌ను ఆసరగా చేసుకుని ఇప్పుడు బెట్టింగ్ రాయుళ్లు పెద్ద ఎత్తున దందా నిర్వహిస్తున్నారు మరి..!
లూడో గేమ్‌కు సంబంధించి బెట్టింగ్ రాయుళ్లు ఆన్‌లైన్‌లో టెలిగ్రాం లింకులను పెడుతున్నారు. ఆ లింక్‌ను సందర్శిస్తే గేమ్‌కు సంబంధించి కోడ్ వస్తుంది. దాన్ని గేమ్‌లో నమోదు చేస్తే.. ఆన్‌లైన్‌లో అవతలి వారితో గేమ్ ఆడవచ్చు. ఇక ఈ సమయంలో బెట్టింగ్ రాయుళ్లు గేమ్ ఆడే వారిపై పందెం కాస్తారు. గేమ్‌లో ఎవరు గెలుస్తారు..? అని చెప్పి ఇతరుల నుంచి పందేలను స్వీకరిస్తారు. ఈ క్రమంలో గేమ్ ముగిశాక గెలిచిన వ్యక్తులతోపాటు పందేలు కాసిన వ్యక్తులకు సొమ్ము అందజేస్తారు. ప్రస్తుతం ఈ తరహా బెట్టింగ్ ఇప్పుడు లూడో గేమ్‌లో ఎక్కువగా జరుగుతోంది.
మధ్యప్రదేశ్‌లో ఇలా లూడో గేమ్‌లో బెట్టింగ్‌లు కాస్తున్న ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు. కనుక మీరు కూడా ఈ విధంగా లూడో గేమ్ ఆడుతుంటే.. వెంటనే ఆ పని విరమించుకోండి. లేదంటే అనవసరంగా జైలు ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుంది..!