బీజేపీ విజయ సంకల్ప సభ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సభలో పాల్గొని ప్రధాని మోడీ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీని ఆశీర్వదించడానికి ఎంతో దూరం నుంచి వచ్చిన ప్రతీ కార్యకర్తకు, సోదర సోదరీ మణులకు, మాతృమూర్తులకు నా నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. ఎక్కడా కేసీఆర్ సర్కారుపై విమర్శల జోలికి వెళ్లని ప్రధాని మోదీ.. రాజకీయాల ఊసెత్తలేదు. గత 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందనే విషయాలను వెల్లడించడానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. పేదలు, దళితులు, వంచితులు, ఆదివాసీల సంక్షేమమే మా బీజేపీ లక్ష్యమని ఆయన వెల్లడించారు.
కరోనా కాలంలో ఉచిత రేషన్, ఉచిత వ్యాక్సిన్ అందించామన్నారు ప్రధాని మోడీ. అంతేకాకుండా.. తెలంగాణ కళాత్మకతను, వీరత్వాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ.. ఈ సభకు హాజరైన వారిని చూస్తే తెలంగాణ మొత్తం ఇక్కడే ఉందనిపిస్తుందన్నారు. తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలను చూసే ఈసారి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించామన్నారు.