బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్‌కు ప్రపంచ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా భారత్ లో సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా ప్రతి ఒక్కరు రిషికి అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైనందుకు రిషి సునాక్‌కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ఆయనతో మోదీ తొలిసారి ఫోన్‌లో మాట్లాడారు.
బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినందుకు రిషి సునాక్‌కు మోదీ మరోసారి అభినందనలు తెలిపారు. భారత్, యూకే మధ్య సమతుల్యతో కూడిన సమగ్రమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఎఫ్‌టీఏ) ఓ ముగింపు దశకు తీసుకురావాల్సిన ఆవశ్యకతపై కీలకంగా చర్చించినట్టు మోదీ తెలిపారు.
“రిషి సునాక్‌తో మాట్లాడినందుకు సంతోషంగా ఉంది. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినందుకు ఆయనకు అభినందనలు తెలిపాను. ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మేం కలిసి పనిచేస్తాం.” అని పేర్కొన్నారు. ప్రపంచ సమస్యలపై రిషితో సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు, రోడ్‌మ్యాప్ 2030 అమలు చేసేందుకు ఎదురుచూస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు.
మరోవైపు, మోదీతో ఫోన్ సంభాషణపై రిషి సునాక్ ఆనందం వ్యక్తంచేశారు. తాను నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫోన్ చేసి అభినందించిన మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.