బీఆర్ఎస్ నేతలకు లిక్కర్ స్కాంతో సంబంధాలు ఉన్నాయి: మోడీ

-

తెలంగాణ బీసీ ఆత్మ గౌరవ సభలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో టీ.బీజేపీ బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించింది. ఈ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. తెలంగాణలో మార్పు మొదలైందని.. ఆ మార్పు తుపాన్ ఈ మైదానంలోనే కనిపిస్తుందని అన్నారు. తెలంగాణ నేలతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు. ఈ సభకు వచ్చిన బీజేపీ లీడర్లు, కార్యకర్తలను చూస్తుంటే కుటుంబ సభ్యుల మధ్యన ఉన్నట్లు అనిపిస్తుందని తెలిపారు. బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించడం భారతదేశ చరిత్రలో కొత్త ప్రయోగం అని అభిప్రాయపడ్డారు.

2019 లోక్ సభ ఎన్నికల్లోనే బీఆర్ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. బీఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తోందన్నారు. ఆ పార్టీ నేతలకు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుతో సంబంధాలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో అవినీతిని అంతం చేస్తాం… ఇది మోదీ ఇచ్చే గ్యారెంటీ అన్నారు. లిక్కర్ స్కాం కేసును దర్యాఫ్తు చేస్తుంటే ఇక్కడి నేతలు సీబీఐ, ఈడీని తిడుతున్నారన్నారు. అవినీతి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదన్నారు. ప్రజాధనాన్ని దోచుకున్న వారి నుంచి తిరిగి రాబడతామన్నారు. టీఎస్‌పీఎస్సీ లీకేజీ బీఆర్ఎస్ వైఫల్యం అన్నారు. అన్ని నియామక పరీక్షలలో అవకతవకలు ఇక్కడ కామన్ అయ్యాయన్నారు. తెలంగాణకు మోసం చేసిన బీఆర్ఎస్‌ను సాగనంపాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఒక తరం భవిష్యత్తును నాశనం చేసిందన్నారు. తెలంగాణ యువతను మోసం చేసిన బీఆర్ఎస్‌ను సాగనంపాలా? లేదా? అన్నారు. తాను ఢంకా బజాయించి చెబుతున్నానని బీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version