కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధాని మోదీ దేశంలో మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే పలు రాష్ట్రాల్లో ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించగా.. తెలంగాణలో మే 7వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు. ఇక లాక్‌డౌన్ నుంచి పలు దశల్లో నెమ్మదిగా ఎలా బయటకు రావాలి.. అనే అంశంపై మోదీ ఇది వరకే పలు సార్లు అన్ని రాష్ట్రాల సీఎంలతో చర్చించగా.. ఇక మరోసారి ఆయన సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 27వ తేదీన ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో మరోమారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 27 తరువాత 6 రోజుల్లో మోదీ విధించిన లాక్‌డౌన్ ముగుస్తుంది. దీంతో లాక్‌డౌన్ గడువు ముగిశాక ఏం చేయాలి..? అనే విషయంపై సీఎంలతో మోదీ చర్చించనున్నట్లు తెలిసింది. ఇక ఇప్పటికే పలు రాష్ట్రాల్లో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో లాక్‌డౌన్ ఆంక్షలను సడలించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పలు రంగాలకు చెందిన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
కాగా భారత్‌లో ఇప్పటి వరకు 20,471 కరోనా కేసులు నమోదు కాగా.. 652 మంది చనిపోయారు. 3959 మంది రికవరీ అయ్యారు. మొత్తం 15859 యాక్టివ్ కరోనా కేసులు ఇప్పుడు భారత్‌లో ఉన్నాయి.