కేబుల్ బ్రిడ్జి ఘటనాస్థలిని పరిశీలించేందుకు.. రేపు మోర్బీకి ప్రధాని

-

గుజరాత్‌లో కేబుల్ బ్రిడ్జి కూలిన ప్రాంతాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిశీలించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం మోర్బీ వెళ్లి ఘటనాస్థలాన్ని మోదీ పరిశీలించనున్నట్లు గుజరాత్‌ ముఖ్యమంత్రి కార్యాలయం నేడు వెల్లడించింది.

ప్రస్తుతం మోదీ గుజరాత్‌ పర్యటనలోనే ఉన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని కేవడియాలోని ఐక్యతా విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఇక్కడ పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయగా.. మోర్బీ ప్రమాదం నేపథ్యంలో వాటిని రద్దు చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. ‘‘నేను ఇక్కడ ఉన్నా.. నా మనసంతా మోర్బీ బాధితుల గురించే ఆలోచిస్తోంది. ఇంతటి బాధను అనుభవించిన సందర్భాలు చాలా తక్కువ. ఓ వైపు గుండెల్నిండా భరించలేని బాధ ఉన్నా.. తప్పక విధులు నిర్వహించాల్సి వస్తోంది’’ అని ఉద్వేగానికి గురయ్యారు.

మోర్బీలోని మచ్చు నదిపై ఉన్న బ్రిటిష్‌ కాలం నాటి కేబుల్ బ్రిడ్జి ఆదివారం కుప్పకూలి పెను ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 134 మంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గల్లంతయ్యారు. వారి కోసం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version