PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన కొనసాగున్నది. మూడ్రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ నేడు న్యూయార్క్ చేరుకున్నారు. ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సదస్సులో నేడు ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ‘న్యూయార్క్ సిటీకి చేరుకున్నాను. సెప్టెంబర్ 25న సాయంత్రం 6.30 గంటలకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్నాను’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
కాగా.. ప్రధాని మోడీ ఏఏ అంశాలను చర్చించనున్నారో అనేది సర్వత్రా చర్చనీయంగా మారింది.
పాక్, ఉగ్రవాదంపై ఏవిధంగా నోరు విప్పుతారు ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ.. పాక్ దురాగాతాలు, ఉగ్రవాదం, ఇండో-పసిఫిక్ సమస్యలపై ప్రసంగించారు.
మరోవైపు ఐక్యరాజ్యసమితిలో భారతీయ దౌత్యవేత్త స్నేహా దూబే మాట్లాడుతూ .. కాశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్‌పై దృష్టి పెట్టిన పాక్ ప్రధాని ఇమ్రాన్ మాటలపై ధీటుగా స్పందించింది. మొత్తం జమ్మూ కాశ్మీర్, లడఖ్ భారత్ అంతర్భాగమేననీ, ఆ భూభాగంలో ఎవరి జోక్యాన్నీ సహంచలేమని తేల్చి చెప్పింది. కాశ్మీర్ లో ఆక్రమించిన భాగాలు వెంటనే ఖాళీ చేయాలని ఐరాస వేదికగా తేగేసి చెప్పింది.
అంతకుముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో వైట్‌హౌస్‌లో భేటీ అయ్యారు. ప్రధానంగా రక్షణ, భద్రత, వాణిజ్యం, ద్వైపాక్షిక అంశాలు, అంతర్జాతీయ వ్యవహారాలు, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలు, వాతావరణ మార్పులు చర్చించినట్టు తెలుస్తోంది.
ఆ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ, భారత్-అమెరికా బంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కరోనా, వాతావరణ మార్పులు వంటి ఇతర సమస్యలపై కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీ భేటీ కావడం విశేషం. అనంతరం క్వాడ్ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశానికి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యొషిహిదే సుగాలు హాజరయ్యారు. మరోవైపు న్యూయార్క్ చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది. వందేమాతరం, భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తించారు ప్రవాస భారతీయులు.