తెలంగాణలో 23 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పోచంపల్లి హ్యాండ్‌లూమ్ పార్క్ మూతపడినట్లు కాగ్ వెల్లడించింది. మరో 2 టెక్స్‌టైల్ పార్కులూ రద్దయినట్లు పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. 2011 మార్చిలో పూర్తయిన పోచంపల్లి పార్క్‌లో 2020 జులై నాటికి 350 మంది పని చేస్తున్నట్లు రికార్డుల్లో కనిపిస్తున్నా.. 2021 డిసెంబరులో జరిపిన క్షేత్రస్థాయి పర్యటనలో మాత్రం మూతపడినట్లు తేలిందని వెల్లడించింది. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ సంస్థ ‘విస్తారా ఐటీసీఎల్ ఇండియా లిమిటెడ్’ ఈ పార్క్‌కు సంబంధించిన స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకొని ఈ-ఆక్షన్‌కు సిద్ధమైనట్లు తెలిపింది.
2021 ఏప్రిల్ 30 నాటికి ఈ పార్క్ ఎస్‌పీవీ సంస్థ నుంచి రూ.69.42 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నట్లు ‘విస్తారా’ పేర్కొందని కాగ్ వెల్లడించింది. పోచంపల్లి పార్క్ మూసివేతకు కారణమేంటన్నది కేంద్రం చెప్పలేదని పేర్కొంది. కేంద్రం దీన్ని నాన్ బ్యాంకబుల్ ప్రాజెక్టు కింద మంజూరు చేసిందని, ఫలితంగా ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయిందని పేర్కొంది.
2006 జులై 1న రూ.106.14 కోట్లతో మహబూబ్‌నగర్‌కు మంజూరైన హైదరాబాద్ హైటెక్ వీవింగ్ పార్క్, 2014 సెప్టెంబరు 20న రూ.105 కోట్లతో రాష్ట్రానికి మంజూరైన అవంతిక టెక్స్‌టైల్ పార్క్ కూడా రద్దయినట్లు కాగ్ తెలిపింది. 2011 సెప్టెంబరు 16న రూ.95.99 కోట్లతో మంజూరైన వైట్‌గోల్డ్ టెక్స్‌టైల్ పార్క్ ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్నట్లు కాగ్ పేర్కొంది. ఇందులో కేంద్రం సమకూర్చాల్సిన రూ.38.40 కోట్ల వాటాలో ఇప్పటివరకు రూ.25.04 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించింది.