నెహ్రూ, ఇందిరా గాంధీ విజయసాయి రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. దేశంలో ఒక ప్రధాని వరుసగా పదేళ్లు అధికారంలో ఉండడం గొప్ప విషయంగా మారిన రోజులివి. 2004లో అనూహ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ తరఫున ప్రధాని అయిన డా.మన్మోహన్ సింగ్ అధికారంలో ఉండగా జరిగిన ఎన్నికల్లో పార్టీ బలం పెరిగాక రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేసి పదేళ్లు ఆ పదవిలో ఉన్నారు. ఆయన తర్వాత బీజేపీ నేత నరేంద్ర మోదీ జీ డా.మన్మోహన్ గారి మాదిరిగా రెండోసారి ఎన్నికల్లో గెలిచి ప్రధానిగా ఇప్పుడు 9 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్నారన్నారు సాయిరెడ్డి.
ఊహించని పరిణామాలు జరగకపోతే మన్మోహన్ జీ మాదిరిగానే 21వ శతాబ్దంలో వరుసగా పదేళ్లు భారత ప్రధానిగా పనిచేసిన రికార్డును మోదీ జీ సమం చేస్తారు. వీరిద్దరి కంటే ముందు వరుసగా ఎక్కువ కాలం ప్రధాని పదవిలో ఎవరెవరు ఉన్నారో పరిశీలిద్దాం. స్వతంత్ర భారతంలో అత్యధిక కాలం పదవిలో కొనసాగిన రికార్డు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూది. భారత రాజ్యాంగం అమలులోకి రావడానికి 2 ఏళ్ల 4 నెలల ముందు అంటే–1947 ఆగస్ట్ 15న ప్రధానిగా ప్రమాణం చేసిన నెహ్రూజీ 1964 మే 27న కన్నుమూసే వరకూ పదవిలో కొనసాగారు. ఆయన దేశ ప్రధానిగా 16 ఏళ్ల 286 రోజులు పదవిలో ఉండి సృష్టించిన రికార్డును ఈరోజుల్లో తిరగరాయడం కష్టమేనని రాజకీయ పండితులు భావిస్తున్నారని తెలిపారు.
నెహ్రూ మరణానంతరం తాత్కాలిక ప్రధాని గుల్జారీలాల్ నందా 13 రోజుల పాలన తర్వాత కాంగ్రెస్ తరఫున ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రీ 1966 జనవరి 11న గుండెపోటుతో మరణించడంతో ఆయన పదవిలో ఉన్నది ఏడాది 216 రోజులే. శాస్త్రీ జీ తర్వాత మళ్లీ తాత్కాలిక ప్రధానిగా 13 రోజుల జీఎల్ నందా సర్కారు దిగిపోయాక 1966 జనవరి 11న తొలిసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టిన నెహ్రూ జీ కుమార్తె ఇందిరాగాంధీ వరుసగా 1967, 1971 ఎన్నికల్లో కాంగ్రెస్ ను విజయపథంలో నడిపించారు. ఇందిరమ్మ 1977 మార్చి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయే వరకూ పదవిలో కొనసాగారు.ఇందిరమ్మ వరుసగా 11 ఏళ్ల 59 రోజులు ప్రధానిగా అధికారంలో కొనసాగి, తండ్రి నెహ్రూ తర్వాత ఎక్కువ కాలం పదవిలో కొనసాగిన రికార్డు స్థాపించారన్నారు.