అక్రమంగా పీడీఎస్ రైస్ తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఆ దుండగులను వెంబడించారు. ఎక్కడ పట్టుబడిపోతామోనన్న భయంతో పోలీసులపై ఆ దుండగులు కారం చల్లి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తనిఖీల కోసం పెట్టిన బారికేడ్లు ఢీకొట్టుకుంటూ మరీ వెళ్లారు. కానీ పోలీసులు పట్టువదలని విక్రమార్కుల్లా వాళ్లని ఛేజ్ చేసి ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ నుంచి నిర్మల్ జిల్లా రోల్‌మామడ టోల్‌ప్లాజా వరకు పోలీసులు వెంబడించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సినిమా సన్నివేశాన్ని తలపించిన ఈ ఘటన శనివారం అర్ధరాత్రి 1 నుంచి 3 గంటల వరకు జరిగింది. ఓ డీసీఎంలో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో నిజామాబాద్ టాస్క్‌ఫోర్స్ సీఐ వెంకటేశ్ ఆధ్వర్యంలో ఐదుగురు సిబ్బంది మోర్తాడ్ వద్ద శనివారం అర్ధరాత్రి నిఘా ఉంచారు. డీసీఎం రాగానే పోలీసులు వెంబడించడం మొదలుపెట్టారు. మరో కారులో వచ్చిన యజమాని సాజిద్ ఈ విషయాన్ని పసిగట్టాడు. వెంటనే డీసీఎం డ్రైవర్‌ను అప్రమత్తం చేశాడు. దీంతో అతను మితిమీరిన వేగంతో నడిపాడు.
పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పలుమార్లు డీసీఎం నుంచే వీరి వాహనంపైకి కారం చల్లాడు. నిర్మల్ జిల్లా గంజల్, రోల్‌మామడ టోల్‌ప్లాజాల దగ్గర బారికేడ్లను ఢీకొడుతూ వెళ్లాడు. చివరికి బాల్కొండ, ముప్కాల్ పోలీసుల సాయంతో రోడ్డుపై రెండు లారీలను అడ్డుపెట్టి డీసీఎంను ఆపించారు. అక్కడ కూడా డ్రైవర్, అతని సహాయకుడు పోలీసులపై కారం చల్లి తప్పించుకోవడానికి ప్రయత్నించినా చాకచక్యంగా పట్టుకున్నారు. 150 క్వింటాళ్ల బియ్యాన్ని బాల్కొండ ఠాణాలో అప్పగించారు. సాజిద్‌తో పాటు మరో ఇద్దరిపై హత్యాయత్నం, బియ్యం అక్రమ రవాణా తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.