గతంలో పోలీసులను దూషించిన కేసులో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదైంది. ఈ విషయాన్ని నర్సీపట్నం టౌన్ సీఐ స్వామినాయుడు తెలిపారు. అయ్యన్నపాత్రుడి సోదరుడు సన్యాసినాయుడు ఇటీవలే వైసీపీలో చేరారు. అయితే తన నివాసంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టిన నేపథ్యంలో, ఈ నెల 12న అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఇరు వర్గాల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని, శాంతిభద్రతలను కాపాడేందుకు, పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు, తాము బందోబస్తును ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
ఆ సమయంలో పోలీసు విధులకు భంగం కలిగించిన అయ్యన్నపాత్రుడు, వారిని అకారణంగా దూషించారని, దీనిపై కేసును రిజిస్టర్ చేశామని అన్నారు. కాగా, అయ్యన్నపాత్రుడు టీడీపీ సీనియర్ నేత. గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఏప్రిల్‌లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి పోటీచేసిన అయ్యన్న వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్ చేతిలో ఓడిపోయారు.