వినాయక నిమజ్జనం సందర్భంగా పాతబస్తీలో పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 2500 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. షా అలీ బండ, అలియాబాద్, లాల్‌దర్వాజ, ఫలక్‌నుమా, నాగుల్‌చింత, చాంద్రాయణగుట్ట, హుస్సేనీ అలం ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్తీలో 2 వేలకు పైగా వినాయక విగ్రహాల ఏర్పాటు చేశారు. ఇప్పటికే వివిధ విభాగాలతో సమన్వయం చేసుకున్న పోలీసులు.. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
గణేశ్ శోభాయాత్ర మార్గంలో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనందన్ తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిమజ్జనం పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. ఇటీవల పాతబస్తీలో జరిగిన అల్లర్ల దృష్ట్యా పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పలువురు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సీపీ మహేశ్ భగవత్ సమీక్ష నిర్వహించారు. ఎల్బీనగర్‌లో పోలీస్ అధికారులతో సమావేశమై.. మల్కాజ్‌గిరి, ఎల్బీనగర్ జోన్ల పరిధిలో నిమజ్జన ప్రక్రియపై పలు సూచనలు చేశారు. సరూర్‌నగర్ చెరువులో నిమజ్జనం దృష్ట్యా పలువురు అధికారులకు బాధ్యతలు అప్పగించారు.