మరి కాసేపట్లో మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ షురూ కాబోతోంది. నియోజకవర్గ ప్రజలు తమను మరో ఏడాది పాటు ఎవరు పాలించాలో నిర్ణయించుకోబోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో పోలింగ్ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మునుగోడు బయల్దేరారు. మునుగోడులోనే మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా.. ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు.
బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి మునుగోడు నియోజకవర్గానికి బండి సంజయ్ బయల్దేరగా పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారికి, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. తొలుత మలక్‌పేట వద్ద అడ్డుకున్నా సంజయ్ ముందుకెళ్లారు. మరోమారు వనస్థలిపురం వద్ద పోలీసులు నిలువరించారు. కార్యకర్తల సహకారంతో కాన్వాయ్ ముందుకు సాగింది.
అనంతరం అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద జాతీయ రహదారిపై తమ వాహనాలుంచి పోలీసులు ఆపారు. బీజేపీ కార్యకర్తలు ధర్నా చేశారు. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో బండి సంజయ్‌ను పోలీసులు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.