తెలంగాణలో రైతుల చుట్టూ రాజకీయం నడుస్తోంది. ధాన్యం కొనుగోలుపై అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య పెద్ద రచ్చే నడుస్తోంది. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదని టీఆర్ఎస్, అసలు కేసీఆర్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని బీజేపీ వాదిస్తుంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ, రైతుల చుట్టూ రాజకీయం నడుపుతున్నారు. అయితే రాజకీయంగా గొడవ పడితే పర్లేదు… కానీ వ్యక్తిగతంగా దాడులు చేయడమే లక్ష్యంగా నాయకులు ముందుకెళుతున్నారు.
అసలు ఇలా దాడులకు ముందు పూనుకుంది టీఆర్ఎస్ అని అర్ధమవుతుంది. ఎందుకంటే రాజకీయంగా ఎన్ని విమర్శలైన చేసుకోవచ్చు. కానీ వ్యక్తిగత దాడులకు దిగకూడదు. ఎవరికి వారు ధాన్యం కొనుగోలుపై మీది తప్పు అంటే మీది తప్పు అని వాదించుకుంటున్నారు. ఇదే క్రమంలో ఐకేపీ సెంటర్లలో ఉండే ధాన్యం కొనుగోలు అంశంపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పోరాటం చేస్తున్నారు. వెంటనే రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రం కొంటామని హామీ ఇచ్చిందని.. ఐకేపీ సెంటర్లలో నెల రోజులుగా రైతులు ధాన్యంతో పడిగాపులు పడుతున్నారని, అయినా సరే కేసీఆర్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై దృష్టి పెట్టలేదని ఈటల రాజేందర్ ఫైర్ అవుతున్నారు.
ఇదే క్రమంలో బండి సంజయ్..వరుసగా నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటిస్తూ..ఐకేపీ సెంటర్లకు వెళ్ళి రైతుల సమస్యలని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడకు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలని వెంటవేసుకుని వచ్చి రచ్చ చేస్తున్నారు. కావాలని బీజేపీ శ్రేణులని రెచ్చగొడుతున్నారు…రాళ్ళతో దాడులు చేస్తున్నారు.
పైగా దాడి చేసేది టీఆర్ఎస్ వాళ్లే…మళ్ళీ బండి గూండాలని వెంటవేసుకుని తిరుగుతూ రైతులపై దాడులు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు రివర్స్‌లో మాట్లాడుతున్నారు. అసలు బండి పర్యటనకు వెళుతుంటే టీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులు పర్మిషన్ ఎలా ఇస్తున్నారనేది అర్ధం కాని విషయం. అంటే ఇదంతా టీఆర్ఎస్ పెద్దల ప్రోద్భలంతోనే జరుగుతుందని అర్ధమవుతుంది. అంటే రాజకీయంగా ఎదురుకోలేక ఇలా టీఆర్ఎస్ రచ్చ చేస్తున్నట్లు కనిపిస్తోంది.