“రైతులు ఎవరైనా ఆడి కార్లలో తిరుగుతారా?, బంగారు గాజులు వేసుకుని ధర్నాలు చేస్తారా?” అంటూ హాస్యనటుడు పృధ్వీ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లో వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన రైతులను ఆ స్థాయిలో వ్యాఖ్యానించడంపై ఇప్పుడు తీవ్ర దుమారమే రేగింది. ఇక అక్కడితో ఆగకుండా పృథ్వీ రైతులను పెయిడ్ ఆర్టిస్ట్ లు అంటూ వ్యాఖ్యలు చేయడంతో పాటుగా,
రైతులు మట్టిలో ఉంటారు దొరికింది తింటారు అంటూ వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై నటుడు పోసాని కృష్ణమురళి కూడా అదే స్థాయిలో స్పందించారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అన్నంతుకు పృథ్వీ సిగ్గు పడాలన్న ఆయా పృథ్వీకి ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా వెంటనే రాజధానిలో మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. రైతులకు కార్లు ఉండకూడదా అని ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యలకు పృథ్వీ కౌంటర్ ఇచ్చారు. అమరావతి ఆందోళనలపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి హోదాలోనే మాట్లాడానని, అమరావతి ఆందోళనల్లో పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారని, వారికి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, ఎవరికీ సంజాయిషీ చెప్పాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేసిన ఆయన, రైతులను తాను అవమాన పరచలేదన్నారు. కేవలం బినామీ రైతులైన పెయిడ్ ఆర్టిస్టులపై మాత్రమే విమర్శలు చేశానని, రైతులంటే తనకు గౌరవం ఉందన్న ఆయన, అమరావతిలో బినామీ రైతులు మీకు కనబడలేదా అని ప్రశ్నించారు.