ఏపీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ సీట్లలో 151 సీట్లను గెలుచుకొని వైసీపీ ఘన విజయం సాధించింది. దీంతో ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది.
ఈనెల 30 న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ సీఎం కేసిఆర్ కూడా హాజరవుతారు. విజయవాడలో జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. మధ్యాహ్నం 12.23 కి జగన్ ఏపీ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీ గెలుపుపై స్పందించారు. వైఎస్ జగన్ కు అభినందనలు చెప్పిన ఉండవల్లి మరో 30 ఏళ్ల వరకు జగన్ ఏపీకి ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. కాకపోతే జగన్ ఏపీని చంద్రబాబులా కాకుండా అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని సూచించారు.
అవినీతి రహిత పాలన అందించడమే తన లక్ష్యమన్న జగన్ వ్యాఖ్యలను ఉండవల్లి సమర్ధించారు. ఏపీలో త్వరలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని చెప్పడానికి జగన్ మాటలే నిదర్శనమన్నారు. మాజీ సీఎస్ అజేయ కల్లం ను ప్రభుత్వ సలహాదారుగా నియమించడంపై ఉండవల్లి హర్షం వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు వ్యతిరేఖంగా ప్రజలు జగన్ కు ఓటు వేయలేదని.. జగన్.. ఏదో చేస్తారని ఓటు వేశారని స్పష్టం చేశారు.
కేరళలో కమ్యూనిస్టుల పాలన దశాబ్దాలుగా సాగుతోందని.. జగన్ కూడా కేరళలో లాగా ఏపీని 30 ఏళ్లు పాలించే అవకాశం ఉందని ఉండవల్లి స్పష్టం చేశారు.