తెలుగు పాలిటిక్స్‌లో నేతల లకు ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు. ఇలా పాదయాత్రలు చేపట్టి ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. ప్రజల్లో కావాల్సినంత ఆదరణ సంపాదించకున్నారు. దివంగత నేత వైఎస్సార్ అప్పట్లో పాదయాత్ర చేపట్టి సంచలనం సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉనికిపాట్లు పడుతున్న కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చారు. ఏకంగా రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు.
ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాదయాత్ర చేపట్టి అధికారంలోకి వచ్చారు. రాష్ట్రమంతా ఆయన చుట్టివచ్చి.. ప్రజల్లో సానుభూతిని సంపాదించకున్నారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా పాదయాత్రచేపట్టి రికార్డు సృష్టించారు. మొన్నటి ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి, వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో తెలంగాణలో మరో నేత రైతు సమస్యలపై ఉద్యమించేందుకు పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈనెల 26వ తేదీ నుంచి మూడురోజుల పాదయాత్ర చేపట్టనున్నారు. బ్రహ్మణవెల్లం నుంచి హైదరాబాద్ లోని జలసౌధ వరకూ ఈ యాత్ర నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ఈ యాత్రకు భారీ సంఖ్యలో రైతుల్ని తీసుకొచ్చేందుకు కోమటిరెడ్డి రెడీ అవుతున్నారు. దాదాపు 5 వేల మందిని యాత్రలో భాగస్వామ్యం చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ యాత్రలో ప్రధాన డిమాండ్ ఏమిటంటే.. బ్రహ్మణవెల్లంల ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలనీ, కావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరడం.
2007లోనే దీనికి అప్పటి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందనీ, దాదాపు 7 వందల కోట్లతో దీన్ని పూర్తి చెయ్యొచ్చుననీ.. కానీ.. కేసీఆర్ సర్కారు దీన్ని పూర్తిగా పట్టించుకోవడం లేదనీ, తనపై రాజకీయ కక్ష పెట్టుకుని ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందంటూ కోమటిరెడ్డి ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరుగుతోందనీ, ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే.. కోమటిరెడ్డి పాదయాత్ర అనుమతి లభిస్తుందా లేదా.. అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. అనుమతి ఇవ్వకుంటే.. హైకోర్టుకైనా వెళ్లి అనుమతి తెచ్చుకుంటానని కోమటిరెడ్డి చెబుతున్నారు. అయితే… ఇక్కడ మరో టాక్ వినిపిస్తోంది. ఈ మూడు రోజుల పాదయాత్రను సక్సెస్ చేసుకుని, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాలన్నదే కోమటిరెడ్డి ప్లాన్ అని పలువురు అంటున్నారు. అందుకే దీనిని ట్రయల్ రన్‌గా చేపడుతున్నారనే టాక్ వినిపిస్తోంది చూడాలి మరి ఏం జరుగుతుందో..!