సీఎం డౌట్: హైకోర్టు తీర్పుతో ప్రతిపక్షాలకు కలిసొచ్చేది ఏమిటి?

-

ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కొనసాగించాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.. ఇదే క్రమంలో నిమ్మగడ్డను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. దీంతో… తాను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి బాధ్యతలు నిర్వహించనున్నట్లు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలియజేశారు! ఈ తీర్పుపై ఏమాత్రం వెనక్కి తగ్గే ఆలోచన చేసే ఉద్దేశ్యం లేని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయని వార్తలొస్తున్నాయి! ఇంతవరకూ ఈరోజు జరిగిన ఏపీ ప్రభుత్వం – హైకోర్టు తీర్పు పరిణామాలు! దీనిపై టీడీపీ నేతలు మైకుల ముందుకు వచ్చి చేస్తోన్న హడావిడిపై కామన్ మ్యాన్ (సీఎం) కి కొన్ని సందేహాలు వచ్చాయి!

వైకాపా ఆధ్వర్యంలోని ఏపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఏర్పడింది కాదు! 175 సీట్లకు గానూ 151 సీట్లు సంపాదించి నికార్సైన ప్రజామోదం పొంది.. పొత్తులు, రాజకీయ అవకాశవాద కూటములు లేకుండా అధికారంలోకి వచ్చింది! అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 90శాతం మేనిపెస్టో హామీలను నెరవేర్చి రాజకీయ విశ్లేషకుల ప్రసంశలు పొందింది! ఈ సందర్భంలో జగన్ సారధ్యంలోని ఏపీ ప్రభుత్వం ఎన్నో మార్పులు, మరెన్నో చేర్పులు, కొత్త ఆలోచనలు చేస్తుంది. ఈ క్రమంలో కొన్ని ఆలోచనలు, మరికొన్ని నిర్ణయాలు కొంతమందికి నచ్చకో, ప్రజామోదంగా అనిపించకో హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. దానిపై విన్న వాదనల మేర హైకోర్టు ఒక తీర్పు వెలువరుస్తుంది.

ఈ లెక్కన చూసుకుంటే… ప్రజాస్వామ్యంలో ఉన్న నాలుగు ఎస్టేట్స్ లో ఎవరి పని వారు చేస్తున్నారు! అవును.. నాలుగు ఎస్టేట్స్ సరిగ్గా పని చేస్తేనే ప్రజాస్వామ్యానికి సరైన అర్ధం! ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నాయస్థానాలు సమర్ధించనంత మాత్రాన్న ఆ తీర్పు… ఆ ప్రభుత్వానికి మొట్టికాయో.. ప్రతిపక్షాలకు ఆవకాయో కాదు! అలా పరిగణించాల్సిన అవసరం అస్సలు లేదు! పనిచేసే ప్రభుత్వం కాబట్టే పలువురు మేధావులు, ప్రజాశ్రేయస్సు కోరేవారు కోర్టు మెట్లు ఎక్కి అభిప్రాయాలు తెలియజేయడం ప్రజాస్వామ్యంలో ప్రజలకే మేలు జరిగే వ్యవహారం! ఇది ప్రభుత్వానికి – న్యాయస్థానాలకు సంబందించిన వ్యవహారం! అయితే… ఈ విషయాలు మరిచిన ప్రతిపక్షాలు మాత్రం.. కేవలం ఈ తీర్పుతోనే ప్రజాస్వామ్యం నిలబడింది అన్నట్లుగా… ఈ తీర్పుతోనే ప్రజాస్వామ్యం పై ప్రజలకు నమ్మకం కలిగిందన్నట్లుగా.. ఈ తీర్పువల్ల ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిందన్నట్లుగా మాట్లాడేస్తున్నాయి!

రేపు ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమర్ధిస్తూ హైకోర్టు తీర్పు ఇస్తే… అప్పుడు ప్రజాస్వామ్యం పై ప్రజలకు నమ్మకం పోయిందని చెబుతారా? ప్రజాస్వామ్యంపై తమకు నమ్మకం పోయిందని చెబుతారా? ప్రజాస్వామ్యానికి ఊపిరి ఆగిందని అభివర్ణిస్తారా? అసలు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల పాలన – న్యాయ్యస్థానాల తీర్పులు అనేవి రొటీన్ కార్యక్రమాలు! ఈ విషయాలు మరిచిన ప్రతిపక్షాలు ప్రజల తరుపున ప్రభుత్వంతో పోరాడటం.. ప్రజల సమస్యలు తెలుస్తుకు తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం మానేసి.. కేవలం కోర్టు తీర్పులను నమ్ముకునే రాజకీయాలు చేయాలనుకోవడం.. ఆ తీర్పులపై ఆదారపడే ప్రజల్లో రాజకీయ పలుకుబడి సంపాదించుకోవాలనుకోవడం.. తమ రాజకీయంగా మనుగడ కాపాడుకోవాలనుకోవడం.. ఇదెక్కడి రాజకీయమో, ఇదెక్కడి ప్రతిపక్ష పాత్రో.. సామాన్యుడికి అర్ధం కావడం లేదంట!

Read more RELATED
Recommended to you

Exit mobile version