మన నేతలు… ఏపీ ద్రోహులు!

-

ఏపీవాసుల దురదృష్టం ఏమిటో కానీ.. మోడీ ప్రధాని అయినప్పటినుంచి ఏపీ ముఖ్యమంత్రులు,సీనియర్ నాయకులు మౌనాన్నే తమ బాషగా చేసుకుంటున్నారు. మోడీ భజనకు ఇచ్చినంత ప్రాధాన్యత ఏపీ ప్రయోజనాలకు ఇవ్వలేకపోతున్నారు. ఫలితంగా చేజేతులా ఏపీకి నష్టం తెస్తున్నారు. ఆ విషయంలో చంద్రబాబు – వైఎస్ జగన్.. ఎవరూ తక్కువకాదు!

పోరాడితే పోయేదేమీ లేదు.. ప్రాణాలు తప్ప! ఇక్కడ అంత సినిమా ఏమీ లేదు. ప్రశ్నిస్తే పోయేదేమీలేదు మోడీతో స్నేహం తప్ప! కానీ.. ఏపీ ప్రజలకు జరిగే మేలు అంతా ఇంతా కాదు! ఈ విషయం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుష్కలంగా పక్కనపెడితే… అదే పంథాలో దూసుకుపోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్!

“ప్రత్యేక హోదానే కావాలి.. ప్యాకేజ్ వద్దు” అని నాడు ఏపీ జనమంతా రోడ్లెక్కి మరీ నిరసన వ్యక్తం చేస్తే… అర్థరాత్రి ప్యాకేజీకి చంద్రబాబు సరే అనేశారు.. కేంద్ర ప్రభుత్వ వెన్నుపోటుకు తనదైన చిరునవ్వుతో స్వాగతం పలికారు. ఇచ్చింది తీసుకుందాం.. లేదంటే ఇది కూడా పోతాది.. అంటూ చేతకాని కబుర్లు చెప్పుకొచ్చారు! ఇది కచ్చితంగా చేతకానితనానికి, ప్రశ్నించలేని తత్వానికి నిదర్శనం. ఫలితంగా హోదా నూ రాలేదు.. ప్యాకేజీ ఏమైందో తెలియలేదు!

2014ఎన్నికల సమయంలో “మోడీ పుట్టడం దేశం అదృష్టం” అన్న స్థాయిలో భజన చేసిన బాబు… “మోడీ – బాబూ కలిస్తే మామూలుగా ఉండదు” అంటూ ప్రచారం చేసుకున్నారు. 2019 ఎన్నికల సమయానికి మోడీతో బాబు రివర్స్ అయ్యారు. విచిత్రం ఏమిటంటే… నాడు వారి స్నేహం వల్ల ఏపీకి ఒరిగిందీ లేదు.. స్నేహం పోయాక కలిసొచ్చిందీ లేదు!

ఇప్పుడు వైఎస్ జగన్ కూడా కేంద్రం విషయంలో మెతక వైఖరే ప్రదర్శిస్తున్నారు. మమతా బెనర్జీ, స్టాలిన్, థాకర్ స్థాయిలో స్పందించలేకపోతున్నారు. ప్రశ్నించే తత్వాన్ని హస్తిన ఫ్లైట్ ఎక్కగానే వదిలేస్తున్నారు. ఫలితంగా ఏపీకి చంద్రబాబులా తీరని ద్రోహం చేస్తున్నారు.

తాజాగా ప్రధాని మోడీ – అమిత్ షా లను కలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్… తనకు కావాల్సిన వాటాలు, రావాల్సిన బకాయిలపై ప్రశ్నించారు.. ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు! మరి ఆ ధైర్యం నాడు బాబుకు లేదు.. నేడు జగన్ కూ లేదు! ఫలితంగా ఏపీవాసులు ఓడిపోతున్నారు!!

విభజనచట్టంలోని హామీలను కేంద్రం ఇప్పటికీ నెరవేర్చలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అయిపోతుంది.. జగన్ స్థాయిలో మోడీని ప్రశ్నించింది లేదు! ఉభయసభల్లోనూ కేంద్ర ప్రభుత్వానికి తనదైన అన్ కండీషనల్ మద్దతు ఇస్తున్న జగన్ సర్కార్ ఇలా మౌనంగా ఎందుకుంటుంది? అన్ని విషయాల్లోనూ తెగింపు నిర్ణయాలు తీసుకుంటారనే పేరున్న జగన్… కేంద్రాన్ని ప్రశ్నించే విషయంలో మాత్రం జడపదార్థంలా ఎందుకు మారిపోతున్నారు?

విభజన చట్టంలోని హామీలపై కేసీఆర్ తాజాగా కేంద్రం వద్ద ప్రస్థావించారు. ఏడేళ్లు గడిచినా ఇంకా విభజన చట్టాన్ని ఎందుకు అమలు పరచడంలేదంటూ కేంద్రాన్ని నిలదీశారు. ప్రధాని మోదీ సహా, అమిత్ షా ముందు కూడా తన కోర్కెల చిట్టా పెట్టారు. అలా కేసీఆర్ తెలంగాణ కోసం గొంతెత్తినా.. పరోక్షంగా, పనిలో పనిగా ఏపీ తరపున కూడా వకాల్తా పుచ్చుకున్నట్టయింది.

ఈ పని జగన్ ఎందుకు చేయడం లేదు? అది బిచ్చం కాదు.. ఏపీకి అధికారికంగా ఉన్న హక్కు. ఈ విషయంలో కూడా జగన్ ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? విభజన చట్టం ప్రకారం కేంద్రం.. తెలంగాణకు న్యాయం చేయాలని చూస్తే మాత్రం ఏపీకి కూడా న్యాయం చేయాల్సిందే. జగన్ ఆ వైఖరిలోనే ఉన్నారా?

కేంద్ర ప్రభుత్వ వైఖరిపైనా, తీసుకుంటున్న ప్రజావ్యతిరేఖ నిర్ణయాలపైనా, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపైనా … తమిళనాడు సీఎం స్టాలిన్ – మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే – పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్థాయిలో పోరాడలేకపోయినా… కనీసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాయిలో అయినా ప్రశ్నించొచ్చు కదా. ఒక పక్క హుజూరాబాద్ లో బీజేపీని ఏకదాటిన విమర్శిస్తూ కూడా.. హస్తిన వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కేసీఆర్. మరి ఈ ఇంగితం, ఆమాత్రం చాణక్యం నాడు చంద్రబాబు – నేడు జగన్ లకు ఎందుకు లేదు?

చంద్రబాబుజగన్ ల ఆలసత్వానికి కారణాలు ఏమిటి? నాడు చంద్రబాబు కి ఉన్న “ఓటుకు నోటు – పుష్కరాల మరణాలు – అవినీతి ఆరోపణలు – పోలవరాన్ని ఏపీకి తీసుకునే కోరిక” లే కారణాలు అయితే… “సీబీఐ కేసులు – రోజు రోజు కీ పెరిగిపోతున్న అప్పులు – విశాఖ రాజధాని కోసం తిప్పలు”.. జగన్ కారణాలు గా విశ్లేషిస్తున్నారు విశ్లేషకులు!

ఇప్పటికైనా మించిపోయింది లేదు. “జగన్ స్పందించాలి.. బాబు సహకరించాలి.. పవన్ కలిసి రావాలి.. మోడీని ప్రశ్నించాలి.. ఏపీకి న్యాయం జరగాలి”! అలా కానిపక్షంలో “మన నేతలు.. ఏపీ ద్రోహులు”గా మిగిలిపోతారు!

– CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version