అతడో నమ్మక ద్రోహి.. సచిన్ పైలట్‌పై అశోక్ గహ్లోట్ సంచలన వ్యాఖ్యలు

రాజస్థాన్ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ మరోసారి సచిన్‌ పైలట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సచిన్‌ పైలట్‌ నమ్మక ద్రోహి అని.. ఏం చేసినా ఆయన సీఎం కాలేరని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆయనకు బీజేపీ నుంచి రూ.10 కోట్లు అందాయని ఆరోపించారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. పది మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా లేని వ్యక్తి పార్టీలో తిరుగుబాటుకు ప్రయత్నించాడని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌కు నమ్మక ద్రోహం చేశాడని అన్నారు. సచిన్‌ పైలట్‌ను కాంగ్రెస్‌ అధిష్టానం సీఎంగా చేయబోదని స్పష్టం చేశారు.

సచిన్‌ పైలట్‌కు బీజేపీతో సంబంధాలున్నాయని సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ఆరోపించారు. ఇద్దరు కేంద్ర మంత్రులైన అమిత్‌ షా, ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆయన దిల్లీలో కలిశారని తెలిపారు. సచిన్‌ పైలట్‌ వర్గం ఎమ్మెల్యేల్లో కొందరికి రూ.5 కోట్లు, మరికొందరికి రూ.10 కోట్లు ముట్టాయని ఆరోపించారు. దిల్లీలోని బీజేపీ కార్యాలయం నుంచి ఆ డబ్బులు అందాయని, పైలట్‌ శిబిరాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సందర్శించారని చెప్పారు. దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు.