ఢిల్లీ త‌దుప‌రి సీఎం ఆమేనా…రేసులో ఉన్న‌దెవరు…!

-

రాజీనామా చేస్తున్నాన‌ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌క‌టించ‌డంతో ఢిల్లీ త‌దుప‌రి ముఖ్య‌మంత్రి ఎవ‌ర‌నే చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. మ‌రో రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేయబోతోన్నట్లు కేజ్రీవాల్‌ వెల్లడించారు. ప్రజలు మళ్లీ కొత్తగా ఓటు ద్వారా తీర్పు ఇచ్చేంత వరకూ తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబోననీ తేల్చి చెప్పారు. ప్రజలు ఎలాంటి తీర్పును ఇచ్చినా దానికి కట్టుబడి ఉంటానని, శిరసా వహిస్తానని అన్నారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాజీనామా ప్రకటన చేశారు. ఢిల్లీ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికలను నిర్వహించిన తరువాతే తాను ముఖ్యమంత్రిగా ఆ సీటులో కూర్చుంటానంటూ అరవింద్ కేజ్రీవాల్ ప్రతిజ్ఞ చేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు సంధించారు కేజ్రీవాల్‌ . మద్యం పాలసీ కుంభకోణం, మనీలాండరింగ్ వంటి లేనిపోని ఆరోపణలు చేశారని, వాటిల్లో ఏ ఒక్కటి కూడా నిరూపితం కాలేదని అన్నారు. రెండు రోజుల్లో.. బీజేపీ నాయకులు చేసినవన్నీ కూడా ఆరోపణలే అనే విషయాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని కేజ్రీవాల్ అన్నారు. అందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతోన్నానని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. తాను నిజాయితీపరుడినని ప్రజలు భావిస్తే ఓటు వేస్తారని, అప్పుడే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటానని అన్నారు. కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది రెండు మూడు రోజుల్లో నిర్ణయిస్తామని పేర్కొన్నారు. కొత్త సీఎం ఎవరు? తాజా పరిణామాలతో ఇక అరవింద్ కేజ్రీవాల్ వారసుడు ఎవరనేది చర్చనీయాంశమౌతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముళ్ల కిరీటంలా తయారైన ముఖ్యమంత్రి పదవిలో ఎవరు కూర్చుంటారనేది ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇక ముఖ్య‌మంత్రి పీఠం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ నలుగురు పేర్లను పరిశీలనలోకి తీసుకుంది. కేజ్రీవాల్ వారసురాలిగా ఢిల్లీ గద్దెను ఎక్కబోయే ఎక్కువ అవకాశాలు మంత్రి ఆతిషికే ఉన్నాయి. ప్రస్తుత కేబినెట్‌లో ఆమె అయిదు మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తోన్నారు. మహిళా శిశు సంక్షేమం, విద్య, పర్యాటకం, ఆర్ట్స్, కల్చర్, లాంగ్వేజ్, పబ్లిక్ వర్క్స్, విద్యుత్ శాఖల మంత్రిగా ఉన్నారు. కేజ్రీవాల్ జైలులో ఉన్నప్పుడు చురుగ్గా వ్యవహరిస్తున్నారు.అటు కేజ్రీవాల్ జైలుకి వెళ్ళిన‌ప్ప‌టి నుంచి బీజేపీ ఆరోపణలను ఆమె సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. . మరో మంత్రి కైలాష్ గెహ్లాట్ పేరు కూడా సీఎం కూడా వినిపిస్తోంది. న్యాయ, శాసన సభా వ్యవహారాలు, రవాణా, పరిపాలన సంస్కరణలు, ఐటీ, రెవెన్యూ, ఆర్థికం, ప్లానింగ్ మంత్రిత్వ శాఖలు ప్రస్తుతం కైలాష్ గెహ్లాట్ పర్యవేక్షణలో ఉన్నాయి.

మరో మంత్రి సౌరభ్ భరద్వాజ్ పేరు కూడా విస్తృతంగా వినిపిస్తోంది. విజిలెన్స్, సర్వీసులు, ప్రజారోగ్యం, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, నీటి పారుదల, వరద నియంత్రణ, మంచినీటి సరఫరా శాఖలకు ఆయన మంత్రిగా వ్యవహరిస్తోన్నారు.మరో సీనియర్ నేత, మంత్రి గోపాల్ రాయ్ పేరు కూడా ప్రచారంలో ఉంది. ఢిల్లీ అభివృద్ది, సాధారణ పరిపాలన, పర్యావరణం, అటవీ, దేశ రాజధాని పరిధిలో వన్యప్రాణుల సంరక్షణ మంత్రిత్వ శాఖలు ఆయన చేతిలో ఉన్నాయి. వీళ్లందరూ కూడా అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకస్తులే.మ‌రి సీఎం పీఠం ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి మ‌రి

Read more RELATED
Recommended to you

Exit mobile version