టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు.. హుజురాబాద్ బరిలో వారు..!

-

హుజురాబాద్ ఉప ఎన్నికలో తామే విజయం సాధిస్తామని అధికార టీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసేందుకు‌గాను పలువురు ఏకమవుతున్నారు. ఎంపీటీసీలు తమకు నిధులు ఇవ్వడం లేదు. కాబట్టి హుజురాబాద్‌లో అధికార గులాబీ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తామని ప్రకటనలు చేశారు. కానీ, ఇంకా ఆ విషయమై స్పష్టత రాలేదు. కాగా, మిడ్ మానేరు నిర్వాసితులు తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు.

 

తమ సమస్యలను టీఆర్ఎస్ సర్కారు అస్సలు పట్టించుకోవడం లేదంటూ మిడ్ మానేరు నిర్వాసితులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లా జిల్లా మిడ్ మానేరు ఐక్యవేదిక పోరుకు సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే పలు రకాల ఆందోళనలు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఐక్యవేదిక నాయకులు వివరిస్తున్నారు.
ఇటీవల వేములవాడ నంది కమాన్ వద్ద నల్ల బ్యడ్జీలు, బెలూన్లతో నిరసన తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం తాము త్యాగం చేశామని, అయినా తమ త్యాగానికి ప్రతిఫలం లేకుండా పోయిందని వాపోతున్నారు. వేములవాడలోని రాజన్న సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మిడ్ మానేరు నిర్వాసితులకు రూ.5 లక్షలు పరిహారంగా ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. అయితే, అది ప్రకటనగానే మిగిలిపోయిందని, ఆచరణలో డబ్బులు రాలేదని వారు చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, తమ సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో హుజురాబాద్ ఉప ఎన్నికలో మిడ్ మానేరు నిర్వాసితుల ఐక్య వేదిక తరఫున 120 మంది బరిలో దిగుతామని చెప్తున్నారు. తమ సత్తా చాటుతామని, ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీ గెలుపునకు సహకరించబోమని అంటున్నారు. తద్వారా గులాబీ పార్టీ ఓటమి పాలయ్యే పరిస్థితులను సృష్టిస్తామని హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version