విశాఖ రాజకీయాల్లో ఆసక్తికర వార్త చక్కెర్లు కొడుతోంది. టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య చిన్నల్లుడు, దివంగత టీడీపీ సీనియర్ నేత ఎంవీవీఎస్. మూర్తి మనవడు శ్రీ భరత్ వైసీపీలోకి వస్తున్నారన్నదే ఆ వార్త సారాంశం. గత ఎన్నికల్లో శ్రీ భరత్ విశాఖ ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో నగరంలోని నాలుగు ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ గెలిచినా ఎంపీ సీటు మాత్రం కోల్పోయింది. కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు భరత్‌కు వ్యతిరేకింగా క్రాస్ ఓటింగ్ ప్రోత్సహించడతోనే భరత్ ఓడిపోయారన్న టాక్ ఉంది. ఇందులో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పేరు కూడా ఉంది.
టీడీపీలోనే మరి కొందరు అప్పుడు జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణకు సహకరించారన్న టాక్ కూడా ఉంది. దీనిపై అప్పట్లోనే మూర్తి వర్గం గరంగరం లాడింది. ఇక ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి భరత్ పార్టీతో అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారు. అయితే తాజాగా ఆయన గీతం విద్యాసంస్థలను ప్రభుత్వం బాగా టార్గెట్ చేసింది. గీతం సంస్థలకు చెందిన అక్రమ భూముల వ్యవహారంపై విరుచుకు పడుతోంది. చంద్రబాబు ఇప్పుడు మూర్తి కుటుంబానికి సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తున్నా.. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాటిని ఎందుకు క్రమబద్ధీకరించలేదన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. కేవలం తన రాజకీయ అవసరాల కోసమే బాబు తమపై ప్రేమ ఉన్నట్టు డ్రామాలు ఆడుతున్నారన్న విషయం మూర్తి కుటుంబం గ్రహించిందంటున్నారు.
ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటును బాబు మూర్తి కుటుంబానికి కాకుండా పల్లా శ్రీనివాసరావుకు ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. అందుకే ఆయన్ను విశాఖ పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడిని చేశారు. బీసీ వర్గానికి చెందిన పల్లాతోనే విశాఖ ఎంపీ సీటును కొట్టాలన్నదే బాబు ప్లాన్‌గా పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అయితే గియితే శ్రీ భరత్‌కు అప్పుడు ఒక్క భీమిలి మాత్రమే ఆప్షన్‌గా ఉంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే భరత్‌తో పాటు మూర్తి కుటుంబం అంతా వైసీపీ వైపు వెళ్లవచ్చన్న ప్రచారం జరుగుతోంది. విశాఖ జిల్లాలో బలమైన కుటుంబాలు ఉంటే వైసీపీలో ఉండాలి.. లేకపోతే రాజకీయాలకు దూరంగా ఉండాలన్న సిద్ధాంతంతోనే జగన్ వీరిని టార్గెట్ చేస్తున్నారట.
ఇక మూర్తి కుటుంబం కూడా బాబు వచ్చే ఎన్నికల్లో భరత్‌ను తప్పించేందుకు ఇప్పటి నుంచే పక్కన పెడుతుండడంతో పాటు రాజకీయంగా వైసీపీ టార్గెట్ చేస్తుండడంతో రాజకీయాల నుంచే సైలెంట్ అవుతుందా ? లేదా ? వైసీపీ కండువా కప్పుకుంటుందా ? అన్న ప్రశ్నలకు కాలమే ఆన్సర్ చేయాలి.