తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. సీట్ల విషయంలో పెద్ద రచ్చ నడుస్తోంది. ఇప్పటికే సీట్ల కోసం దరఖాస్తులు కూడా స్వీకరించారు. 119 స్థానాలకు వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో అభ్యర్ధులని ఎంపిక చేయడం పెద్ద తలనొప్పిగా మారింది. ఇదే సమయంలో బిసిలకు ఇచ్చే సీట్ల విషయంలో అనేక విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. బిసిలకు మొత్తం 34 సీట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.
తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు ఉండగా, ఒకో స్థానం పరిధిలో 2 అసెంబ్లీ సీట్లు ఇస్తామని చెప్పారు. ఆ లెక్కన చూస్తే ఇప్పుడు కొన్ని చోట్ల బిసిలకు సీట్లు ఇచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. ఉదాహరణకు నల్గొండ పార్లమెంట్ ఉంటే ఆ పరిధిలో ఒక రిజర్వడ్ సీటు తీసేస్తే..మిగతా 6 జనరల్ సీట్లు. కానీ ఆరు సీట్లలో రెడ్డి నేతలు పోటీ పడుతున్నారు. దీంతో బిసిలకు సీటు ఇచ్చే అంశంపై రచ్చ ఉంది. అయితే బిసి నేతలు ఈ అంశంపై గట్టిగానే పోరాడుతున్నారు. ఖచ్చితంగా 34 సీట్లు ఇవ్వాల్సిందే అని అంటున్నారు.
గత ఎన్నికల్లో బిసిలకు సీట్లు ఇస్తే.. ఆ స్థానాల్లో కొందరు అగ్రవర్గాల నేతలు..బిసి నేతలని పరోక్షంగా ఓడించడానికి పనిచేశారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా సీట్ల విషయంలో కోతలు విధిస్తున్నారని, గత ఎన్నికల్లో పలువురు అగ్రకులాల నేతలు కూడా ఓడిపోయారని గుర్తు చేస్తూ..సర్వేల పేరుతో బిసిలకు సీట్ల కోత విధించవద్దు అని అంటున్నారు.
అలాగే కావాలని బిసి సీట్లని టార్గెట్ చేస్తే..రెడ్డి నేతలని ఓడించడానికి కూడా వెనుకాడమని కాంగ్రెస్ బిసి నేతలు అంటున్నారు. దీంతో కాంగ్రెస్ లో రెడ్డి వర్సెస్ బిసి అన్నట్లు పంచాయితీ నడుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే కాంగ్రెస్‌కే నష్టం.