తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిగ్‌ ట్విస్ట్‌

-

  • బీజేపీకి అండగా టీడీపీ నేతల ప్రచారం
  • ఎన్నికల వేళ స్థానిక రాజకీయాల్లో వింత పరిణామాలు
  • భారీ ట్విస్ట్‌ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్ధతు ఎవరికి…?పోటీ నుంచి తప్పుకున్నామని టీడీపీ అధినాయకత్వం తేల్చినప్పటి నుంచి అందరిలో మెదులుతున్న ప్రశ్న ఇది. అయితే ఈ ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు తెలంగాణ టీడీపీ శ్రేణులు అనూహ్యంగా బీజేపీ అభ్యర్ధుల ఎన్నికల ప్రచారాల్లో కనిపిస్తున్నారు. ఇది ప్రస్తుతం స్థానిక రాజకీయాల్లో తెరమీదకి వచ్చిన తాజా ట్విస్ట్‌. పోలింగ్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇలాంటి ట్విస్ట్‌లు ఇప్పుడు బయటపడుతున్నాయి.బీఆర్‌ఎస్‌,కాంగ్రెస్‌,బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉండగా బీజేపీ జనసేన పొత్తుతో బరిలో నిలిచింది. తెలుగుదేశం పార్టీ మాత్రం పోటీలో లేదు.ఈ నేపథ్యంలో టీడీపీ ఓటు బ్యాంకు ఏ పార్టీ వైపు వెళుతుందోనన్న చర్చ గత కొద్దిరోజులుగా నడుస్తోంది.

ఆ ఓట్లు కాంగ్రెస్‌కు పడతాయనే ప్రచారాన్ని టీడీపీ సానుభూతి పరులు తెరమీదకి తీసుకువచ్చారు కానీ బీజేపీ నిలబెట్టిన ఎమ్మెల్యే అభ్యర్ధుల ప్రచారాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఖండువాలు కనిపించడంతో తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఏపీలో ఇప్పటికే జనసేన,టీడీపీ కలిసి నడుస్తున్నాయి. దీంతో తెలంగాణలో జనసేన పోటీ చేసే స్థానాల్లో పవన్‌ కళ్యాణ్‌ మద్ధతు కోరినట్లు తెలిసింది.అదే సమయంలో మిగిలిన నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్ధులకు మద్ధతు ఇవ్వాలనే ప్రతిపాదన పవన్‌కళ్యాణ్‌ చేయగా టీడీపీ సానుకూలంగా స్పందించినట్లు ఇప్పుడు కనిపిస్తున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రస్తుతం బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారే అధికంగా ఉన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ బహిరంగంగానే బీజేపీకి మద్ధతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు టీడీపీ సానుభూతి పరులు,కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్‌ పార్టీకి మద్ధతు పలుకుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది.రేవంత్‌రెడ్డి టీపీసీసీ ఛీఫ్‌గా ఉండటంతో టీడీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు మళ్ళుతుందనే అంచనాలు వేశారు. అనూహ్యంగా టీడీపీ నాయకులు ,కార్యకర్తలు బీజేపీ అభ్యర్ధుల ప్రచారంలో కనిపించడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ జనసేన బీజేపీకి మద్ధతు తెలుపుతూ టీడీపీ అగ్రనేతలు ప్రకటన చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ టీడీపీ మద్ధతు కోరగా దానికి చంద్రబాబు,లోకేష్‌ సానుకూలంగా స్పందించారనే వార్తలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి.

2018 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్‌ ఎన్నికలకు వెళ్ళినప్పటికీ అనుకున్నంత స్థాయిలో సీట్లు రాలేదు. ఈ సారి కూడా ఆ ఓట్లు కాంగ్రెస్‌ పడతాయనే ప్రచారం జరగ్గా పోలింగ్‌ టైమ్‌ దగ్గర పడుతున్న వేళ పెద్ద ట్విస్ట్‌లు బయటపడుతున్నాయి. తాజాగా తెలంగాణలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలను బట్టి చూస్తే ఇక్కడ ఫలితాలు ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది. మరి టీడీపీ అధినాయకత్వం చెప్పిన మాట కేడర్‌ వింటుందా… ఆ మాటలు శిరసావహించి జనసేన,బీజేపీ అభ్యర్ధులకు టీడీపీ శ్రేణులు,సానుభూతిపరులు ఓట్లు వేస్తారా అనేది ఫలితాల తరువాతనే తేటతెల్లంకానుంది.ఇక్కడ బీజేపీకి మద్ధతు ఇవ్వడం ద్వారా ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి వెళ్ళే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.తెలంగాణ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఏపీలో పొత్తులపై అటు భారతీయ జనతాపార్టీ ,తెలుగుదేశం పార్టీ అధిష్టానాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version