జమిలి ఎన్నికలు… ఇవి గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న పదం.. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని బిజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.. ఇందుకోసం ఆ పార్టీ రోడ్ మ్యాప్ కూడా సిద్దం చేసింది.. 2027లో జమిలి ఎన్నికలు నిర్వమించాలని భావిస్తోంది.. దీన్ని కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నా.. ఏన్డీఏ మాత్రం దూకుడుగా ముందుకెళ్తోంది.. పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టబోతుంది..
పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ.. మాజీ రాష్టపతి రామ్ నాధ్ కోవింద్ సమర్పించిన నివేదికకు కేంద్రమంత్రివర్గం ఇటీవల ఆమోద ముద్ర వేసింది.. ఒక దేశం- ఒకే ఎన్నికల విధానాన్ని అమలు చెయ్యడం ద్వారా ఎన్నికల ప్రక్రియ సులభతరం అవుతుందని, తద్వారా వేగవంతమైన ఆర్దికాభివృద్దికి దారి తీస్తోందని కోవింద్ కమిటీ తెలిపింది. ఈ ఎన్నికలను 30కిపైగా పార్టీలు సమర్దిస్తుండగా.. కాంగ్రెస్ సహా 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి..
ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లుని ప్రవేశపెడతారని ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి.. భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఇచ్చిన నివేదికను ఇప్పటికే కేంద్ర మంత్రివర్గం ఆమోదించి తొలి అడుగు వేసింది. ఇక వేయాల్సిన మరిన్ని అడుగులకు రంగం సిద్ధం అవుతోంది. ఒక పద్ధతి ప్రకారం ఈ సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లుని బిజేపీ తీసుకొస్తుందని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ బిల్లుకు లోక్ సభ రాజ్యసభలలో ఆమోదించుకునేలా బిజేపీ వ్యూహాలు రచిస్తోంది..
బిజేపీ ఈ బిల్లుపై దూకుడుగా వెళ్తుంటే.. కాంగ్రెస్ తో సహా డీఎంకే, వామపక్షాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.. దేశంలో పార్లమెంట్ తోపాటు.. అన్ని రాష్టాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు గతంలో కూడా జరిగాయి.. 1951 నుంచి 1967 వరకూ దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలే జరిగాయి.. ఈ క్రమంలో కొన్ని రాష్టాలకు మధ్యంతర ఎన్నికలు రావడంతో జమిలి కనుమరుగైంది.. ఈ క్రమంలో ఎన్డీఏ మరోసారి జమిలిని తీసుకురావాలని పట్టుదలతో ఉంది.. ఈ క్రమంలో 2027లో ఎన్నికలు వస్తాయో రావో చూడాలి..