ఈనెల 27న హన్మకొండలో బీజేపీ బహిరంగ సభ

-

ఈనెల 27న హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తున్న క్రమంలో బండి సంజయ్ కూడా కరీంనగర్​లో తన నివాసం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. తెరాస ప్రభుత్వం అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశ నిర్బంధాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన దీక్ష మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది.

“దిల్లీ లిక్కర్​ కుంభకోణం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె కవితపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మరలించడానికే నన్ను అరెస్టు చేశారు. ఈ విషయం తెలంగాణ ప్రజలందరికి అర్థమయింది. ఎన్ని నిర్బంధాలకు గురిచేసినా ప్రజాసంగ్రామ యాత్రను కొనసాగించిన తీరుతాం. దాంతో పాటు ఈ నెల 27న హన్మకొండ ఆర్ట్స్​ కళాశాల మైదానంలో రెండు గంటలకు భారీ బహిరంగ సభను కూడా నిర్వహిస్తాం.” – బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

మరోవైపు హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలోనూ పలువురు ముఖ్యనేతలు నిరసన దీక్షకు దిగారు. ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, మాజీ ఎంపీలు విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సినీనటి జీవితా రాజశేఖర్, భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు, ఆ పార్టీ రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు. ప్రజాసంగ్రామ యాత్రకు ప్రజల నుంచి స్పందన చూసి జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడ్డుకునే చర్యలు దిగుతున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news