ఎట్టకేలకు గులాబీ పార్టీతోనే తమ పోరాటమని కేంద్ర మంత్రి అమిత్ షా నిరూపించారు. నిర్మల్ వేదికగా తెలంగాణలో టిఆర్‌ఎస్‌ని గద్దె దించడమే తమ లక్ష్యమని అమిత్ షా చాటి చెప్పారు. కేసిఆర్‌తో దోస్తీ లేదని, ఇక కుస్తీనే అని షా మాటలు రుజువు చేస్తున్నాయి. రాబోయే 2024లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని స్ట్రాంగ్‌గా చెబుతున్నారు.
ఈ పరిస్తితుల నేపథ్యంలో టిఆర్‌ఎస్‌తో బిజేపి పొత్తు ఉందని ప్రచారం జరిగింది. ఢిల్లీ నుంచి తెలంగాణలో గల్లీ వరకు ఈ ప్రచారం వచ్చింది. అయితే ఈ ప్రచారాన్ని రాష్ట్ర బిజేపి నేతలు ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వచ్చారు. కానీ ఈ పొత్తుల ప్రచారంపై బిజేపి కేంద్ర నాయకత్వం మాత్రం స్పందించలేదు. తాజాగా మాత్రం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్‌కు వచ్చిన అమిత్ షా….టిఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలపై విమర్శల దాడి కొనసాగించారు. మజ్లిస్, టీఆర్‌ఎస్ అధికారంలో లేనప్పుడే తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని, బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ గౌరవాన్ని శాశ్వతంగా కాపాడుతామని షా మాట్లాడారు.
అయితే షా వ్యాఖ్యలతో ఇంతకాలం టిఆర్‌ఎస్‌తో బిజేపికి పొత్తు ఉందనే ప్రచారానికి తెరపడినట్లైంది. ఇక కేసిఆర్‌తో బిజేపి తాడోపేడో తేల్చుకోవడమే తరువాయి. మొత్తానికైతే పొత్తు పేరిట…కమలానికి గుచ్చుకున్న గులాబీ ముల్లుని షా పీకేశారని చెప్పొచ్చు.