తెలంగాణలో అధికార బిఆర్‌ఎస్ పార్టీలో నేతలు ఫుల్ గా ఉన్న విషయం తెలిసిందే. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉండటంతో..టిడిపి, కాంగ్రెస్, ఇంకా చిన్నాచితక పార్టీ నేతలంతా బిఆర్ఎస్ లోకి వచ్చేశారు. దీంతో బిఆర్‌ఎస్ పార్టీ నిండిపోయింది. అలా ఇతర పార్టీల నుంచి నేతలు రావడం బిఆర్‌ఎస్ పార్టీకి ఎంత లాభం జరిగిందో..ఇబ్బందులు కూడా అలాగే వస్తున్నాయి. ముందు నుంచి పార్టీలో ఉన్నవారికి కాకుండా వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి సీట్లు ఇచ్చిన నేపథ్యంలో..సీట్లు దక్కని వారు ఇప్పుడు బిఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చేందుకు చూస్తున్నారు.
ఇప్పటికే కేసిఆర్ 115 స్థానాల్లో అభ్యర్ధులని ఖరారు చేశారు. దీంతో సీటు ఆశించి భంగపడినవారు ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళేందుకు చూస్తున్నారు. అలా పార్టీ జంప్ అవ్వడం వల్ల బిఆర్‌ఎస్ కు కాస్త నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆ నష్టం జరగకుండా బిఆర్‌ఎస్ అధిష్టానం చర్యలు తీసుకుంటుంది. ఎక్కడకక్కడ నేతలకు సర్దిచెబుతుంది. ఇటీవల కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు దక్కని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీటు దక్కని వారిని బుజ్జగిస్తూ..వారికి కీలక పదవులు ఇస్తున్నారు.
తాజాగా వేములవాడ సీటు దక్కని ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు ప్రభుత్వ సలహాదారు పదవి కేబినెట్ హోదాలో నియమించారు. అటు వైరాలో రాములుకు సీటు ఇవ్వలేదు. దీంతో ఆయన్ని బుజ్జగిస్తూ..మళ్ళీ అధికారంలోకి వస్తే కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆయన కాస్త శాంతించారు.
అలాగే సీటు దక్కని ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రాథోడ్ బాపురావులకు సర్ది చెప్పారు. అటు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కాంగ్రెస్ లోకి వెళుతున్నారు. ఇటు స్టేషన్ ఘనపూర్ సీటు కడియం శ్రీహరికి ఇవ్వడంతో ఎమ్మెల్యే రాజయ్య ఇంకా అసంతృప్తితోనే ఉన్నారు. ఇంకా సీట్లు దక్కని సీనియర్ నేతలని సైతం బిఆర్‌ఎస్ అధిష్టానం బుజ్జగిస్తుంది. మళ్ళీ రాబోయేది బిఆర్‌ఎస్ పార్టీనే ..కాబట్టి ఒక్కసారి పార్టీ మారే ముందు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు.