ఈ సారి ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరిగే నియోజకవర్గాల్లో పరకాల ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న పరకాలలో ఈ సారి రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో జరగడం ఖాయం. గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్న చల్లా ధర్మారెడ్డి ఈ సారి గట్టి పోటీ ఎదురుకోవాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ పోటీ ఎలా ఉంటుందనే అంశం ముందు..ఒకసారి పరకాల నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే..1952లో ఏర్పడిన ఈ స్థానంలో కాంగ్రెస్ ఎక్కువ సార్లు గెలిచింది. మధ్యలో బిజేపి, సిపిఐ, టిడిపిలు గెలుస్తూ వచ్చాయి.
2004 నుంచి ఇక్కడ బిఆర్‌ఎస్ హవా మొదలైంది. 2004లో ఇక్కడ బిఆర్‌ఎస్ గెలిచింది. 2009 ఎన్నికల్లో సీన్ మారింది. కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ గెలిచారు. అప్పటికే శాయంపేట నుంచి గెలుస్తూ వచ్చిన ఆమె..2009లో పరకాలకు మారి గెలిచారు. ఇక వైఎస్సార్ కేబినెట్ లో మంత్రిగా చేశారు. అయితే ఆయన మరణంతో..సురేఖ మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి వదిలేసి..జగన్ పెట్టిన వైసీపీలోకి వచ్చి 2012 ఉపఎన్నికలో పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు బిఆర్‌ఎస్ గెలిచింది.
ఇక 2014 ఎన్నికల్లో ఇక్కడ అనుహ్యాంగా టిడిపి గెలిచింది. టిడిపి నుంచి చల్లా ధర్మారెడ్డి గెలిచారు. తర్వాత మారిన రాజకీయాల నేపథ్యంలో ఆయన బిఆర్‌ఎస్ లోకి వచ్చారు. ఈ క్రమంలోనే 2018 ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసి చల్లా గెలిచారు. మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో పోటీకి చల్లా రెడీ అవుతున్నారు.
ఈ సారి చల్లాపై పోటీకి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ రెడీ అవుతున్నారు. సురేఖ ఈ సారి వరంగల్ ఈస్ట్‌లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. కొండా వారసురాలు బరిలో ఉండటంతో ఈ సారి పరకాల పోటీ రసవత్తరంగా మారనుంది. చూడాలి మరి ఈ సారి పరకాలలో పై చేయి సాధించేది ఎవరో.