కుప్పం..చంద్రబాబు కంచుకోట…వరుసగా 1989 నుంచి గెలుస్తూ వస్తున్నారు. ప్రతిసారి మంచి మెజారిటీనే వస్తుంది..కానీ 2019 ఎన్నికల్లోనే సీన్ రివర్స్ అయింది. మెజారిటీ తగ్గింది. అదే సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక చంద్రబాబుని ఓడించడమే లక్ష్యంగా పనిమొదలుపెట్టింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంచార్జ్ భరత్ కుప్పంపై ఫోకస్ చేసి పనిచేస్తున్నారు. ఇంతకాలం అక్కడ బాబుకు అండగా ఉంటున్న వారిని వైసీపీ వైపుకు తీసుకొచ్చారు.
పంచాయితీ ఎన్నికల్లో గెలిశారు..స్థానిక ఎన్నికల్లో గెలిశారు. ఆఖరికి కుప్పం మున్సిపాలిటీని సైతం వైసీపీ కైవసం చేసుకుంది. దీంతో కుప్పం అసెంబ్లీని సైతం కైవసం చేసుకుంటామని వైసీపీ అంటుంది. ఈ క్రమంలోనే చంద్రబాబుకు టెన్షన్ మొదలైంది. అసలు నామినేషన్ సైతం కార్యకర్తలతో వేయించే బాబు..ఇప్పుడు వీలు కుదిరినప్పుడల్లా కుప్పం వస్తున్నారు. అక్కడ తన బలం తగ్గకుండా చూసుకుంటున్నారు. కానీ వైసీపీ మాత్రం అక్కడ దూసుకెళుతుంది. ఊహించని విధంగా బలం పెంచుకుంది. అయితే రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో బాబుకు కుప్పం వెళ్ళే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
అందుకే ఇటీవల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌కు కుప్పం బాధ్యతలు అప్పగించారు. తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన శ్రీకాంత్‌ని కుప్పం పంపించారు. అలాగే శ్రీకాంత్ సైతం కుప్పంలో పర్యటించడానికి అక్కడ ప్రోటోకాల్ పొందారు. అలాగే కుప్పం ఎక్స్‌అఫిషియో మెంబర్ కూడా అయ్యారు. దీంతో కుప్పంలో ఆయన పనిచేయవచ్చు. మున్సిపల్ సమావేశాల్లో పాల్గొనవచ్చు.
కుప్పంలో చంద్రబాబుని మంచి మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా శ్రీకాంత్ పనిచేయనున్నారు. అయితే వైసీపీ ఎత్తులతో బాబు టెన్షన్ పట్టుకుని శ్రీకాంత్‌ని కుప్పంకు పంపించారు. కానీ అక్కడ వైసీపీ దూకుడుగా వెళుతుంది. ఆ దూకుడుకు శ్రీకాంత్ బ్రేకులు వేయడం కష్టమే. ఏదేమైనా సరే ఈ సారి కుప్పంలో బరిలో చంద్రబాబుకు గట్టి పోటీ తప్పదు.