15వ ఆర్థిక సంఘంతో చంద్ర‌బాబు భేటీ

-

  • కేంద్రం వివ‌క్ష‌పై నివేదిక‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయ బాధిత రాష్ట్రం అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 15వ ఆర్థిక సంఘంతో సీఎం చంద్రబాబునాయుడు గురువారం స‌చివాల‌యంలో సమావేశం అయ్యారు. పలువురు మంత్రులు, సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, నాలుగేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతి, వృద్ధి గణాంకాలపై 15వ ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని సీఎం చెప్పారు. పునర్విభజన చట్టంలో పొందుపరచిన ఏ అంశాన్నీ అమలు చేయలేదన్నారు. అయినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. దేశ సంపద వృద్ధికి దోహదపడేలా మా కృషి సాగుతోందని పేర్కొన్నారు. పురోగామి రాష్ట్రాలను దెబ్బతీయడం మంచిది కాదని హితవు పలికారు. అభివృద్ధి చెందే రాష్ట్రాలకు చేయూత అందించాలని కోరారు.

ఆర్థిక సంఘాల నివేదికలకు 1971 జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలన్నారు. మధ్యప్రదేశ్‌లో మెట్రోలకు భారీ నిధులు సమకూర్చారని తెలిపారు. కానీ విశాఖ, విజయవాడ మెట్రోలకు మాత్రం మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. గతంలో నయా రాయపూర్‌కు రూ.4500 కోట్ల సాయం అందించారని గుర్తుచేశారు. అమరావతికి కనీసం రూ.9,000 కోట్లు కేంద్రం గ్రాంటుగా ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.22,250 కోట్లు సిఫార్సు చేయాలన్నారు. కేంద్రం ఇచ్చిన రూ.350కోట్లు వెనక్కి తీసుకుందని విమర్శించారు. 14వ ఆర్థిక సంఘంపై నెపాన్ని నెట్టి హోదాపై కేంద్రం మాటమార్చిందని సీఎం ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version