బాబు నిర్ణయంతో టీడీపీ భూస్థాపితమేనా….!

-

చంద్రబాబు తీసుకున్న అనూహ్య నిర్ణయం ఇప్పుడు తెలుగు తమ్ముళ్లను కలవరపెడుతోంది. రాజకీయాల్లో అపర చాణిక్యుడు అంటూ తనను తాను చెప్పుకుంటారు చంద్రబాబు. ఇక 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర అని కూడా గొప్పలు చెప్పుకుంటారు. వీటన్నిటికి తోడు… 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహించిన రికార్డు కూడా తన సొంతమంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంతకాలం పాటు ఎవరూ ముఖ్యమంత్రిగా లేరని గొప్పగా చెప్పుకుంటారు చంద్రబాబు.

అలాంటి నేత ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఉమ్మడి రాష్ట్రానికి అత్యధిక కాలం పాటు ముఖ్యమంత్రి ఎవరూ అంటే ఠక్కున చెప్పే పేరు చంద్రబాబు. 1995 నుంచి 2004 వరకు 9 ఏళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలోనే ఎంతో అభివృద్ధి చేశానంటారు కూడా. ఇంకా చెప్పాలంటే… సైబరాబాద్ సిటీ తన వల్లే వచ్చిందని…. హైదరాబాద్ నగరాన్ని తానే అభివృద్ధి చేశానని గొప్పగా చెప్పుకుంటారు. ఐటీ రంగంలో వేల కోట్ల పెట్టుబడులు తన వల్లే అని కూడా చెప్తారు. అలాంటి నేత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సమయంలో రెండు కళ్ల సిద్ధాతంతో బొక్క బోర్లా పడ్డారు. తెలంగాణలో పార్టీని గాలికి వదిలేశారు.

రాష్ట్ర విభజన తర్వాత కేవలం ఏపీకి మాత్రమే చంద్రబాబు పరిమితమయ్యారు. పేరుకే జాతీయ పార్టీ అయినప్పటికీ… తెలంగాణలో పార్టీని నడిపించే నేత కరువయ్యాడు. 2014 ఎన్నికల్లో కాస్త మెరుగైన ఫలితాలు వచ్చినప్పటికీ… గెలిచిన నేతలంతా బీఆర్ఎస్ పార్టీలోకి, కాంగ్రెస్‌లోకి పోవడంతో… 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా కరువయ్యారు. అయినా సరే… బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే… నెమ్మదిగా పార్టీని నడిపిస్తున్నాడు చంద్రబాబు. జైలులోకి వెళ్లిన తర్వాత… అక్కడ ఏం ఆలోచించారో ఏమో తెలియదు కానీ… తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని నిర్ణయించారు చంద్రబాబు.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాసాని జ్ఞానేశ్వర్… టీడీపీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్‌లో చేరిపోయాడు. దీంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని స్థితి తెలుగు తమ్ముళ్లది. చంద్రబాబు జైలులో ఉన్నన్ని రోజులు హైదరాబాద్‌ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నానా హంగామా చేశారు. చివరికి హైటెక్ సిటీ నిర్మాత అంటూ బాలయోగి స్టేడియంలో పెద్ద కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌లోని ఇంటి వరకు భారీ ర్యాలీ కూడా చేశారు. మా బలం ఇంతా అని గొప్పలు చెప్పుకున్నప్పటికీ… కొత్తగా వచ్చిన పార్టీల పాటి ధైర్యం కూడా చేయకుండా… మేము ఎన్నికలకు దూరం అని చంద్రబాబు ప్రకటించడంతో ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితమనే మాట బలంగా వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version