ఆ ఇద్దరు మంత్రులు జగన్ ని టెన్షన్ పెడుతున్నారా ?

-

ఏ ప్రభుత్వాన్ని అయినా నడిపించటంలో మంత్రులదే కీలక పాత్ర . మంత్రుంటే సీఎంకు చేదోడువాదోడుగా ఉంటూ పాలనలో సహకరించాలి. కానీ, అలాంటి వాళ్లే కీలక సమయంలో వివాదాస్పమౌతున్నారా.వివాదస్పద వ్యాఖ్యలతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నారా ? కృష్ణా జిల్లాకి చెందిన ఇద్దరు మంత్రుల పై ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో అదే అభిప్రాయం వినిపిస్తుంది.

సంక్షేమ కార్యక్రమాలతో ఏపీలో కొత్త ట్రెండును సృష్టిస్తూ ప్రజల్లో తనదైన మార్కు తో దూసుకెళ్తున్నారు ఏపీ సీఎం జగన్. రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. లెక్కచేయకుండా, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. ప్రకటించిన క్యాలెండర్ ప్రకారమే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. దీంతో పేద, బడుగు వర్గాల్లో ప్రభుత్వం మీద.. ముఖ్యంగా సీఎం జగన్ మీద ఓ నమ్మకం కలిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా పంట నష్ట పరిహారాన్ని కూడా వెంటనే అందించి రైతు వర్గాల్లో కూడా మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు సీఎం. అలాగే ఏపీలో ఇంతకుముందు ఎవ్వరూ చేయని విధంగా లక్షల సంఖ్యలో ఇళ్ల పట్టాలను పంపిణి చేస్తున్నారు.

ఇంత వరకు బాగానే ఉంది. సీఎం పడుతున్న శ్రమకు తగినట్టు ప్రభుత్వానికి ఆ స్థాయిలో ఇమేజ్ వస్తున్నా.. దానికి సమాంతరంగా వివాదాలూ ఏపీ ప్రభుత్వాన్ని చుట్టుముడుతూనే ఉన్నాయి. ఈ వివాదాల్లో మంత్రులు తలనొప్పిగా మారుతున్నారనే వాదనలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఏపీలో విగ్రహాల విధ్వంసం హాట్ టాపిక్. ప్రతిపక్షాలు వీలైనంత రచ్చచేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో గట్టి కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత మంత్రులపై ఉంటుంది. కొందరు మంత్రులు ఆశించిన స్థాయిలో బాధ్యతగా ఉంటున్నా, కొందరు మంత్రులు మాత్రం దీనికి విరుద్ధంగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ మంత్రుల తీరు చివరకు సీఎం జగన్ మోహన్ రెడ్డికి తలనొప్పిగా తయారవుతోందనే వాదనలున్నాయి.

ఈ మధ్య కాలంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేసిన అంశం గుడివాడ పేకాట క్లబ్బుల వ్యవహరం. మామూలుగా అయితే పేకాట క్లబ్బులపై దాడి జరిగి డబ్బులు దొరికినా అంతగా హైలెట్ కావు. కానీ కొన్ని రోజుల క్రితమే గుడివాడ పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ అక్కడ మంత్రి కొడాలి నాని పై స్వయంగా పేకాట క్లబ్బులు నడిపిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. దీనికి మంత్రి కొడాలి నాని కూడా గట్టిగానే బదులిచ్చారు. అసలు గుడివాడ నియోజకవర్గం పరిధిలో పేకాట క్లబ్బులే లేవంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకే స్వయంగా పోలీసులే గుడివాడ నియోజకవర్గ పరిధిలోని ఓ పేకాట క్లబ్బుపై దాడి చేయడం.. నగదును పట్టుకోవడం సంచలనం సృష్టించింది. దీంతో మంత్రి కొడాలితో పాటు ప్రభుత్వం కూడా ఇరకాటంలో పడిన పరిస్థితి ఏర్పడింది.

ఏపీలో ప్రభుత్వం మీద.. సీఎం జగన్ మీద ఏ ఆరోపణ వచ్చినా, దానికి గట్టిగా కౌంటర్ ఇచ్చే మంత్రుల జాబితాలో మంత్రి కొడాలి ముందుంటారు. కానీ ఈ ఎపిసోడులో మంత్రి డిఫెన్సులోకి వెళ్లిన పరిస్థితి ఏర్పడింది. పైగా అక్కడితో ఆగకుండా.. పేకాట ఆడితే తప్పేంటి.. జరిమానా కట్టి.. బయటకొచ్చి మళ్లీ ఆడతారంటూ మంత్రి కొడాలి చేసిన కామెంట్లు మరో రచ్చకు దారి తీశాయి. గత ప్రభుత్వంలో చింతమనేని ప్రభాకర్ కూడా ఇలాగే ఇష్టానుసారంగా కామెంట్లు చేశారని గుర్తు చేస్తున్నారు.

ఇక ప్రభుత్వాన్ని తాజాగా ఇరకాటంలోకి నెట్టిన మరొకరు మంత్రి వెలంపల్లి. రామతీర్ధం ఎపిసోడులో ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించే క్రమంలో అశోక్ గజపతి రాజును ఉద్దేశించి వెంలపల్లి చేసిన కామెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా రచ్చకు దారి తీశాయి. అధికార పార్టీలో కూడా అశోక్ గజపతి రాజును ఉద్దేశించి వెలంపల్లి ఆ తరహా కామెంట్లు చేయకుండా ఉంటే బాగుండేదనే భావన వ్యక్తమవుతోంది. ఇలా ఒకరిద్దరు మంత్రుల తీరు ప్రభుత్వానికి, ఏపీ సీఎంకు తలనొప్పిగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సున్నితమైన అంశాల్లో ప్రభుత్వానికి సపోర్ట్ గా నిలబడాల్సిన మంత్రులే ఇబ్బందులు సృష్టిస్తున్నారనే టాక్ వస్తోంది. ఈ విషయంపై బహిరంగంగా ఎవరూ మాట్లాడకున్నా, ప్రభుత్వ, పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version