పూటకో మలుపు తిరుగుతున్న మధ్యప్రదేశ్ రాజకీయాలు, అసలు ఏం జరుగుతుంది!

-

పరిస్థితి ఇంకా తమ చేతుల్లోనే ఉంది అనుకున్న కమల్ నాథ్ ప్రభుత్వానికి ఈ రోజు అనుకోని గట్టి షాక్ తగిలింది. మధ్యప్రదేశ్ లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుండి సంకటంలో పడిపోయింది. పూటకో మలుపు తిరుగుతూ అక్కడి రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల తో పాటు 6 మంది కేబినెట్ మంత్రులు బెంగుళూరు చేసుకున్నట్లు తెలుస్తుంది. భోపాల్ నుంచి మూడు ప్రత్యేక చార్డ్ట్ ఫ్లైట్ లో వారందరినీ జాగ్రత్తగా తరలించినట్లు సమాచారం. దీనితో ఇప్పుడు కమల్ నాథ్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. ఇంతమంది ఒక్కసారిగా పార్టీ కి దూరంగా వ్యవహరిస్తుండడం తో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ మొత్తం వ్యూహానికి కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా నే కారణమన్నట్లు సమాచారం. సర్కార్ లో ఇంత గందరగోళం జరుగుతున్నప్పటికీ ఆయన దేశ రాజధాని ఢిల్లీ లోనే ఉండిపోవడం విశేషం. అంతేకాకుండా ఈ 18 మందిలో అత్యధికులు ఈయన వర్గం వారే కావడం తో ఈ సంక్షోభానికి సింధియానే కారణం అని కాంగ్రెస్ లోని ఒక వర్గం తీవ్రంగా ఆరోపిస్తుంది. మరోపక్క ఎప్పుడు అధికార పీఠం దక్కించుకోవాలా అని ఆత్రంగా చూస్తున్న బీజేపీ సభలో కమల్ నాథ్ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కూడా వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రం లో ఏర్పడిన ఈ సంక్షోభంపై ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయి చర్చించినట్లు తెలుస్తుంది.

ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో పాటు ఇతర సీనియర్ నేతలు కూడా పాల్గొన్నట్లు సమాచారం. మరోపక్క కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తనను కలవడానికి ఢిల్లీకి వచ్చిన సింధియాకు కనీసం ఆమె అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడం విశేషం. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ఏర్పడిన సంక్షోభం విషయం లో భారతీయ జనతా పార్టీ హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడుతోందని కాంగ్రెస్ ముఖ్యులు విమర్శలు చేసినప్పటికీ, సింధియా తిరుగు బావుటానే కాంగ్రెస్ దుస్థికి కారణం అని కొందరు అంటున్నారు. మరి దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news