రానున్న లోక్‌సభ ఎన్నికలతోపాటు అటు ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌కే ఓటు వేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరనున్నట్లు తెలిసింది. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడే వైకాపా అభ్యర్థులకే ఓటు వేయాలని ఆ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ త్వరలో విజ్ఞప్తి చేయనున్నారని సమాచారం. ఈ మేరకు తెరాస అధికార ప్రతినిధి ఆబిద్ రసూల్ ఖాన్ ఓ మీడియా సంస్థతో తాజాగా మాట్లాడారు. జగన్‌కే ఓటు వేయాలని సీఎం కేసీఆర్ అతి త్వరలోనే ఏపీ ప్రజలను కోరే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
సీఎం కేసీఆర్ తెరపైకి తేవాలని అనుకుంటున్న ఫెడరల్ ఫ్రంట్‌కు ఇప్పటికే వైకాపా అధినేత జగన్ మద్దతు తెలిపిన విషయం విదితమే. గత నెలలోనే కేటీఆర్ జగన్‌ను కలిసి మద్దతు అడగ్గా అందుకు జగన్ సానుకూలంగా స్పందించారు. తాను కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడానని, ఫెడరల్ ఫ్రంట్‌కు తన మద్దతు ఉంటుందని జగన్ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రభుత్వానికే తమ మద్దతు ఉంటుందని, అందుకు తెలంగాణ కూడా సాయం చేస్తుండడం శుభ పరిణామమని, ఇరు రాష్ట్రాల ఎంపీలు కలసి కట్టుగా ఉంటే, రెండు తెలుగు రాష్ట్రాలకు కావల్సిన వాటిని సాధించుకోవచ్చని కూడా జగన్ అప్పట్లో అన్నారు.
ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ కూడా ఏపీ సీఎం చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని అన్నారు. ఆ తరువాత పలు మార్లు కూడా ఇదే విషయాన్ని కేసీఆర్ ప్రస్తావిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే జగన్‌కు ఓటు వేయాలని ఏపీ ప్రజలను కోరడం ద్వారా తెలంగాణ సీఎం కేసీఆర్, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేసీఆర్ జగన్‌కు ఓటు వేయాలని మాత్రమే ఏపీ ప్రజలను కోరుతారా, లేదంటే.. జగన్‌కు మద్దతుగా ఏపీలో ప్రచారం చేస్తారా.. అన్న విషయాల్లో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. కానీ త్వరలో ఆ వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది..!