సీఎం కేసీఆర్ ఏపీ ప్రజలకు.. తెలివైన నాయకున్ని ఎన్నుకోవాలని అప్పీల్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు కేటీఆర్ ఇప్పటికే ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు కూడా.
ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు తెలంగాణలోని అధికార పార్టీ తెరాస మొదట్నుంచీ మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లోనే కేసీఆర్ ఏపీకి జగనే సీఎం అవుతారని చెప్పారు. కానీ అలా జరగలేదు. చాలా స్వల్ప ఓట్ల శాతంతో టీడీపీ గెలుపొందింది. అయితే అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 5 ఏళ్లుగా జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అటు వైకాపాకు, ఇటు తెరాసకు మధ్య మరింత బంధం బలపడింది. ఈ క్రమంలోనే గత రెండు నెలల కిందట కేటీఆర్ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జగన్‌ను కలసి ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతు కూడా కోరారు. అందుకు జగన్ సమ్మతించారు.
అయితే అంతకు ముందు నుంచే తెరాస వైకాపాకు మద్దతుగానే ఉంటోంది. ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని అన్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా సీఎం కేసీఆర్ చంద్రబాబుకు ఎలాంటి గిఫ్ట్ ఇస్తారా.. అని అందరిలోనూ చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే తెరాస ఏపీలో వైకాపాకు మద్దతుగా ప్రచారం చేస్తుందని కూడా అందరూ భావించారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరుగుతుండడంతో ఏపీలో ప్రచారం చేసేందుకు తెరాసకు అంత సమయం ఉండదని భావిస్తున్నారు.
అలాగే ఏపీలో జగన్‌కు అనుకూలంగా సీఎం కేసీఆర్ గనక ప్రచారం చేస్తే… దాన్ని చంద్రబాబు నాయుడు తమకు అనుకూలంగా మార్చుకుంటారని కూడా తెరాస భావిస్తోంది. కనుకనే ఏపీలో తెరాస జగన్ కోసం ప్రచారం చేయబోవడం లేదని తెలుస్తోంది. కానీ సీఎం కేసీఆర్ ఏపీ ప్రజలకు.. తెలివైన నాయకున్ని ఎన్నుకోవాలని అప్పీల్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు కేటీఆర్ ఇప్పటికే ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు కూడా. ఈ క్రమంలోనే కేసీఆర్.. సరైన నాయకున్ని ఎన్నుకోవాలని ఏపీ ప్రజలను కోరనున్నట్లు తెలిసింది. అయితే లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభల్లో మాట్లాడనున్న కేసీఆర్.. అవే సభల్లో ఏపీ ప్రజలకు అప్పీల్ చేస్తారని సమాచారం. సీఎం చంద్రబాబు కుట్రలను వివరిస్తూ జగన్‌కు ఓటు వేయాలని ఏపీ ప్రజలను కేసీఆర్ కోరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఈ విషయంపై స్పష్టత రావాలంటే.. మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు..!