బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రయత్నాలకు చెక్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో సీజర్ ఆలోచనలో ఉన్న తలసాని …యూపీ మాజీసీఎం అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం నడిపారు. నేరుగా రాహుల్ గాంధీ ద్వారా కాంగ్రెస్లో చేరి మంత్రి పదవి కొట్టేద్దామనుకున్నారు.అయితే తలసాని ప్రయత్నాలకు బ్రేక్ వేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.ఓవైపు తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పంపిణీ స్కామ్‌లో నిజానిజాలు తేల్చే ప్రయత్నం చేస్తుండగా అప్పట్లో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన తలసానిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడం సరికాదని రేవంత్ రెడ్డి…,రాహుల్ గాంధీకి క్లారిటీ ఇచ్చారట.దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న తలసాని ప్రయత్నాలకు మరోసారి బ్రేక్ పడిందని టాక్ నడుస్తోంది.
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు అందరూ వచ్చినా ఆహ్వానిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి…,తలసాని శ్రీనివాస్ యాదవ్ ను చేర్చుకునేందుకు ఆసక్తిగా లేరు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంత ప్రయత్నించినా గాంధీ భవన్ తలుపులు మాత్రం తెరుచుకోవడంలేదు. తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అవకతవకలు జరిగాయంటూ ఏసీబీ విచారణ చేస్తోంది. ఏసీబీ అధికారులు పలువురిని అరెస్ట్ కూడా చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నారు. గొర్రెల పంపిణీ స్కామ్‌లో తలసాని పాత్ర కూడా ఉందని, ఈ కేసులో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోందని వార్తలొచ్చాయి. ఈ కేసులో తలసాని అరెస్ట్ కూడా అవుతారని ప్రచారం కూడా జరిగింది. ఇలాంటి సమయంలో ఆయన్ని కాంగ్రెస్ లో చేర్చుకుంటే పార్టీకి నష్టమని రేవంత్ భావిస్తున్నారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా తలసాని మాత్రం తన ప్రయత్నాలను ఆపడం లేదని తెలిసింది. ఎలాగైనా కాంగ్రెస్ లో చేరాలన్న పట్టుదలతో ఉన్నారు. తలసాని కాంగ్రెస్‌లో చేరడం ద్వారా తన కొడుకు సాయి కిరణ్ రాజకీయ భవిష్యత్తుకు కూడా ఢోకా ఉండదని అతని ఆలోచన. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన కొడుకుకు బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించినా దక్కలేదు. ఆ తర్వాత కంటోన్మెంట్ ఉపఎన్నిక సమయంలో కూడా తన కొడుకుని పోటీకి నిలబెట్టాలని ప్రయత్నించినా బీఆర్ఎస్ టికెట్ రాలేదు. ఇక అప్పటినుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కాంగ్రెస్ లో చేరే ఆలోచనలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్‌లో చేరితే తనతో పాటు తన కొడుకుకూ రాజకీయంగా కలిసొస్తుందని అనుకుంటున్నారు. మరి తలసాని ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.