టీ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. నేతలు వర్గాల వారిగా విడిపోయారు. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ తీరుపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు కనిపిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తీరుపై విమర్శలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిన బుజ్జగించే పనిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
ఇదిలా ఉంటే మరోమారు కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బహిర్గంతం అయ్యాయి. మేడ్చల్ వేదికగా రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కనిపించింది. ఈనెల 9,10 తేదీల్లో మేడ్చల్ కొంపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణ తరగతులు, జనజాగరణ పేరుతో సదస్సు ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుచరుడు మహిపాల్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేరుతో ప్లెక్సీలు, హోర్డింగులు, కటౌంట్లను ఏర్పాటు చేశారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్లెక్సీలను చింపివేశారు. బ్లేడుతో కటౌట్లను కత్తిరించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలోని మరోవర్గం నాయకుడి అనుచరులే ఈ విధంగా చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.