ఏపీలో పాలిటిక్స్ క్షణం క్షణం మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నాం. ఏ నాయకుడు.. ఎప్పుడు ఏ పార్టీలో చేరుతాడో తెలియట్లేదు. అయితే.. మిగితా రాష్ట్రాల్లో కాకుండా.. ఏపీలో మాత్రం వార్ వన్ సైడే అన్నట్టుగా ఇతర పార్టీల నుంచి వైసీపీలోని వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన చాలామంది ముఖ్య నేతలు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ నుంచి కూడా వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి.
తాజాగా మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఆయన వైసీపీలో చేరుతున్నట్టు ఇదివరకే ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. వాటిని నిజం చేస్తూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆయనతో పాటు తన కొడుకు హితేశ్ చెంచురామ్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ వైసీపీలో చేరనున్నారు. ఈ నెల 27న తాడేపల్లిలో వైసీపీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో వాళ్లు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
ఈసందర్భంగా మాట్లాడిన దగ్గుబాటి.. జగన్ మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి అని పేర్కొన్నారు. అందుకే జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ప్రజల ఆశీస్సులతో మార్టూరు, పర్చూరు శాసనసభ్యునిగా 5 సార్లు గెలిచినట్టు తెలిపారు.