భవన కార్మికుల కష్టాలు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన లాంగ్ మార్చ్ పై ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. విశాఖలో దీనికి పిలుపు ఇవ్వడానికి కారణం ఏంటి అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి కాళీ గా ఉండి ఏం చెయ్యాలో తెలియక ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారని ఆరోపిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ పై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్ర విమర్శలు చేసారు.ఆయన ఒక అజ్ఞాని అంటూ విమర్శలు చేసారు.
శనివారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కృష్ణదాస్ ఒక రాజకీయ పార్టీకి అధినేతగా ఉండి రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలైన పవన్‌కు విమర్శించే నైతిక హక్కు లేదని ఆయన ఎద్దేవా చేసారు. ఇసుక విధానంపై కనీస అవగాహన లేని జనసేన అధ్యక్షుడు సిఎం జగన్ ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. పవన్‌ను రాజకీయ అజ్ఞానిగా భావించవచ్చునని, ఆయన చేయబోయే లాంగ్‌మార్చ్ ప్రజలను వంచించడానికేనని ధర్మాన తీవ్ర విమర్శలు చేసారు.
ఇసుక సమస్య త్వరలోనే తీరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబునాయుడు ఒకే బాటలో పయనిస్తున్నారని ఆరోపించిన ఆయన తొలి నుంచీ ఇద్దరికీ రాజకీయ బంధం ఉందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేతులు కలపడంతో మరోసారి బట్టబయలైందన్నారు. టెక్కలి, నరసన్నపేట తదితర కేంద్రాల్లో ఇసుక నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేసారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుకి చంద్రబాబు మద్దతు ఇవ్వడం ఇప్పుడు విడ్డూరంగా మారింది.