ఢిల్లీకి ఈటల రాజేందర్, బండి సంజయ్ పయనం.. టిఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకేనా?

-

ఎలాగైనా హుజురాబాద్​ ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని బీజేపీ యోచిస్తోంది. అందుకు అవసరమైన అన్ని సన్నాహాలు చేస్తూ… ముందుకెళ్తుంది. బీజేపీ అగ్రనేత అమిత్​ షాతో ఈ రోజు బీజేపీ స్టేట్​ ఛీఫ్ బండి సంజయ్​, మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ సమావేశం అయ్యారు. ఈటల రాజేందర్​ గతంలో ఆరుసార్లు హుజురాబాద్​ లో ఎమ్మెల్యేగా గెలవడం కూడా తమకు కలిసి వస్తుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఇంకా ఉప ఎన్నికకు కనీసం షెడ్యూల్​ కూడా ప్రకటించకుండానే ప్రధాన పార్టీలన్నీ ఇక్కడ చేస్తున్న హంగామా ను చూసి నియోజకవర్గ వాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. మరో పక్క ఇక్కడ రోజురోజుకూ కోవిడ్​ కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అయినా కానీ నాయకులు ప్రచారంలో ఎక్కడా తగ్గట్లేదు. ఎలాగైనా ఈ ఉప ఎన్నికల్లో గెలిచి తమకు ఎదురే లేదని టీఆర్ఎస్​TRS , గెలవడం ద్వారా టీఆర్​ఎస్​ పై ప్రజల్లో వ్యతిరేఖత మొదలైందని నిరూపించాలని బీజేపీ తాపత్రయపడుతున్నాయి. రేవంత్​ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్​ కూడా స్పీడును పెంచింది.

పాడి కౌశిక్​ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న ఇంచార్జి పోస్టును సీనియర్​ నేతతో భర్తీ చేసింది. ఈ ఎన్నికల్లో మేము కూడా పోటీలో ఉన్నామని, తమను ఎవరు కూడా తక్కువ అంచనా వేయడానికి వీలులేదని చాటి చెప్పింది. ఈ ఎన్నికల్లో గెలవకపోయినా గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్​ యోచిస్తోందట. పైగా రేవంత్​ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ శ్రేణులు నూతన ఉత్సాహంతో ఉన్నారని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version