తెలంగాణలో రాజకీయాలు అనూహ్యంగా మలుపు తిరుగుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా ఈటలపై కబ్జా ఆరోపణలు రావడం, మంత్రి పదవి నుంచి తొలగించడం చకచకా జరిగిపోయాయి. ఆ వెనువెంటనే దేవరయంజాల్ భూముల కోణం తెరమీదకు రావడంతో రాజకీయాలు భగ్గుమన్నాయి. ఇక ఇప్పుడు ఈటల రాజేందర్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి.
తనను మంత్రి పదవి నుంచి తొలగించడంతో తన బలం నిరూపించుకునేందుకు ఏకంగా 2వేల కార్లలో నియోజకవర్గానికి వెళ్లారు ఈటల రాజేందర్. దీంతో ఆయనను ఒంటరి చేసేందుకు పార్టీ ఎత్తుగడ వేసింది. ఆయన అనుచరులను లాగేసుకునేందుకు మంత్రి గంగుల కమలాకర్ మంతనాలు జరపుతున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈటల మరో స్టెప్ వేశారు. నిన్న మధ్యాహ్న సమయంలో కాంగ్రెస్ సభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్కను ఆయన ఇంట్లో కలిశారు. కరెక్టుగా కేటినెట్ మీటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆయయన భట్టిని బంజారాహిల్స్‌లోని ఆయన ఇంట్లో కలిశారు. దాదాపు 40 నిముషాల సేపు వీరిద్దరూ చర్చించుకున్నారు. కాగా వీరి భేటీపై ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. అయితే వీరిద్దరు మాత్రం ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు, కరోనా పరిస్థితులపై చర్చించుకున్నట్టు ఇరు వర్గాలు భావిస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌లో ఈటల చేరుతారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా ఈటల వ్యూహం ఎవరికీ అంతుచిక్కడం లేదు.